
యాంటీ లార్వా ఆపరేషన్ మరింత వేగవంతం
● ఆస్పత్రుల్లో ప్రసవాలు మరిత పెరగాలి ● డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు ● గోమంగి, రూడకోట పీహెచ్‌సీల తనిఖీ
పెదబయలు: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ఆపరేషన్ మరింత వేగవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి. విశ్వేశ్వరనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని గోమంగి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో ప్రతీ నెల 15 నుంచి 20 ప్రసవాలు జరుగుతున్నాయని సిబ్బంది వివరించారు. మలేరియా, టీబీ ఇతర వ్యాధులకు సంబంధించి కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిసరాల శుభ్రత పాటించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోమంగి పీహెచ్‌సీ అంబులెన్స్ పాడైనందున కొత్త అంబులెన్సు ఇస్తామన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రూడకోట పీహెచ్‌సీని సందర్శించారు. సిబ్బందితో సమావేశమయ్యారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించిన డెలివరీ హోంను పరిశీలించారు. ఈ నెల 12న నేషనల్ డీ వార్మింగ్ డేను విజయవంతం చేయాలని సూచించారు.గోమంగి పీహెచ్‌సీకి ప్రహరీ మంజూరు చేయాలని జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, స్థానికులు డీఎంహెచ్‌వోను కోరారు. ఈ కార్యక్రమానికి గోమంగి, రూడకోట, పెదబయలు పీహెచ్‌సీ వైద్యాధికారి చైతన్య కుమార్, సత్యారావు, సంజీవ్ పాత్రుడు, నిఖిల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యాంటీ లార్వా ఆపరేషన్ మరింత వేగవంతం