
వరిలో యాజమాన్యంతోనే అధిక దిగుబడి
వ్యవసాయశాఖ ఏడీ తిరుమలరావు
చింతపల్లి: గిరిజన రైతాంగం వరి పంటలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీవీ తిరుమలరావు సూచించారు. ఆయన మంగళవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలో గల వాముగెడ్డలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి నాట్లు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ఈ తరుణంలో రైతాంగం నాట్లు వేసే ముందు వరి నారు చివర ఆకులు తుంచి, జీవామృతంలో ముంచి పలుచగా ఒకటి రెండు మొనలతో నాట్లు వేసుకోవాలన్నారు.రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటిస్తే మంచి దిగుబదులు పొందవచ్చునన్నారు. అనంతరం చౌడుపల్లి సచివాలయంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కౌలు రైతులు కార్డులు, వ్యయసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతిక పద్ధతులు, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొర్రా లలిత, వ్యవసాయాధికారి టి మధుసూదనరావు, సేంద్రియ విభాగం శాస్త్రవేత్త సందీప్ నాయక్, ప్రకృతి విభాగం మండల ఇన్‌చార్జి కొర్రా మోహన్, ఆత్మ ఏటీఎం మహేశ్వరి, వీహెచ్‌ఏలు శోభన్ తదితరులు పాల్గొన్నారు.