
అధికారుల తీరుపై స్థల దాత నిరసన
● ఉపాధి కల్పించలేదంటూ ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు ● సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని స్పష్టీకరణ ● పెదగూడలో ఘటన ● సాయంత్రం వరకు నిరీక్షించిన సిబ్బంది ● ఇబ్బందులు పడిన గర్భిణులు, బాలింతలు, చిన్నారులు
ముంచంగిపుట్టు: అధికారులు ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రానికి స్థలదాత తాళాలు వేసి నిరసన తెలిపాడు. మండలంలోని పెదగూడలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెదగూడ గ్రామానికి చెందిన చిత్తపులి రామ్‌కుమార్ 2015లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం భవనాల నిర్మాణానికి ఐదు సెంట్ల భూమి ఇచ్చాడు. ఆ సమయంలో తన కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని అతను తెలిపాడు. అప్పటి నుంచి ఇచ్చిన హామీని అమలుచేయాలంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే గ్రామానికి వచ్చిన ఐటీడీఏ పీవోలకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన రామ్‌కుమార్ బుధవారం ఉదయం ఆ రెండు కేంద్రాలకు తాళాలు వేసి అధికారుల తీరుపై నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేసే వరకు తాళాలు తీసేది లేదని స్పష్టం చేశాడు. విధులు నిర్వహించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్య సిబ్బంది,అంగన్‌వాడీ సిబ్బంది కేంద్రాలకు తాళాలు వేసి ఉండడంతో స్థానిక సర్పంచ్ బాబూరావు,ఎంపీటీసీ గణపతిలను ఆశ్రయించారు. వెంటనే వారు రామ్‌కుమార్‌ను పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో వైద్య,అంగన్‌వాడీ సిబ్బంది తాళాలు వేసిన విషయాన్ని మండల స్థాయి అధికారులకు తెలియజేశారు. తరచూ స్థలదాత ఇబ్బందులు పెట్టడం వల్ల భయభయంగా పనిచేయాల్సి వస్తోందని వారు వాపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద నిరీక్షించిన ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాబూరావు మాట్లాడుతూ ఆయా శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. తాళాలు వేయడం వల్ల గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, పంచాయతీ ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారన్నారు.