
కోతకు గురైన ‘మాచ్‌ఖండ్ రిటైనింగ్ వాల్ ’
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన రిటైనింగ్ వాల్ వరదనీటి ఉధృతికి కోతకు గురైంది.డుడుమ జలాశయం పవర్ గేట్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఈ నెల 2వ తేదీన ప్రాజెక్టు ఉన్నతాధికారులు పరిశీలించారు. పరిశీలినలో భాగంగా రెండు గేట్లను తెరిచారు. దీంతో ఒక్కసారిగా నీరు ఉధృతంగా ప్రవహించి,గేట్లు మూసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.ఈ నీటి ఉధృతికి పవర్‌కెనాల్‌కు చెందిన రిటైనింగ్ వాల్ 15అడుగుల మేర కోతకు గురైంది.దీంతో డుడుమ జలాశయం నుంచి ప్రాజెక్టుకు సొరంగమార్గం ద్వారా వెళ్లే నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పలు చోట్ల కెనాల్ గోడలకు రంధ్రాలు ఏర్పడి,నీరు వృధాగా పోతోంది.మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చెందిన కాలువకు 70 ఏళ్లగా మరమ్మతులు చేయకపోవడం ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు పవర్ గేట్లు పని చేయకపోతే వేసవి కాలంలో తనిఖీలు చేయాలి. కానీ డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉన్నప్పుడు తనఖీల పేరుతో పవర్ గేట్లు ఒక్కసారిగా తెరవడం ఈ కోతకు కారణమని తెలుస్తోంది. నీరు పోకుండా కోతకు గురైన పలు ప్రదేశాల్లో రెండు రోజులుగా ప్రాజెక్టు కార్మికులు రాళ్లను అడ్డుపెట్టే పనులు చేస్తున్నారు.ప్రాజెక్టు ఉన్నతాధికారుల నుంచి మాత్రం ఎటువంటి చర్యలు లేవు.

కోతకు గురైన ‘మాచ్‌ఖండ్ రిటైనింగ్ వాల్ ’