
మంచు.. మండే ఎండ.. ఆపై వాన
సాక్షి,పాడేరు/అరకులోయటౌన్/డుంబ్రిగుడ: జిల్లాలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పొగ మంచు దట్టంగా కురవగా, మధ్యాహ్నం భానుడు ప్రతాపాన్ని చూపించాడు. సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరు, అరకులోయతో పాటు పలు ప్రాంతాల్లో వేకువజాము నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. వాహన చోదకులు లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపించాడు. మధ్యాహ్నం ఎండ ప్రచండంగా నిప్పులు కురిపించాడు. అధిక ఎండతో జిల్లా కేంద్రం పాడేరులోని పాతబస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో జనసంచారం తక్కువగా ఉంది. సాయంత్రం 4గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంది. అధిక ఎండతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం పాడేరు మండలం గుత్తులపుట్టు, డోకులూరు, బరిసింగితో పాటు హుకుంపేట మండలంలోని పలు చోట్ల,అరకులోయ, డుంబ్రిగుడలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. డుంబ్రిగుడ మండలంలో సుమారు రెండు గంటల పాటు పాటు భారీ వర్షం పడింది. కించుమండ, డుంబ్రిగుడ, అరకు, గుంటసీమలలో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి,
ఉష్ణోగ్రతల వివరాలు
జిల్లాలో వై.రామవరంలో 37.8 డిగ్రీల గరిష్ట, 23.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారేడుమిల్లిలో గరిష్టం 37.8, కనిష్టం 23.3, చింతూరులో 37.4 – 26.1, రాజవొమ్మంగిలో 37.0 – 26.1, కొయ్యూరులో 36.8 – 26.3, అడ్డతీగలలో 36.3 – 26.4, రంపచోడవరంలో 36.0 – 25.4, అరకులోయలో 34.3 – 20.6, పాడేరులో 34.0 – 21.3, చింతపల్లిలో 31.5 – 21.0, హుకుంపేటలో 31.3 – 21.3, పెదబయలులో 31.2 – 20.7, డుంబ్రిగుడలో 31.2 – 20.2, అనంతగిరిలో 30.5 – 23.3, జి.మాడుగులలో 30.2 – 20.2, ముంచంగిపుట్టులో గరిష్టం 29.1, కనిష్టం 20 డిగ్రీల ఉష్ణోగ్రత సోమవారం నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు.
జిల్లాలో భిన్న వాతావరణం

మంచు.. మండే ఎండ.. ఆపై వాన

మంచు.. మండే ఎండ.. ఆపై వాన