
స్వచ్ఛంద సంస్థ, దాతల ఔదార్యంతో పాఠశాలకు భవనం
● పాఠశాల ప్రారంభం ● విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం
ముంచంగిపుట్టు: మండలంలో గల కుమడ పంచాయతీ కిందుగూడ ఎంపీపీ పాఠశాలకు పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భవన సమస్య తీరింది. కిందుగూడ పాఠశాలకు భవనం లేక గ్రామస్తులు పాకను శ్రమదానంతో నిర్మించుకున్నారని వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు ట్రస్ట్ సభ్యులు స్పందించారు. ఇందులో భాగంగా దాతలు కాకినాడకు చెందిన చాంగటి వెంకట రూ. 1.50లక్ష, కడపకు చెందిన కేతవరపు రవికిషోర్ రూ.25వేలు, హైదరాబాద్‌కు చెందిన మద్దిరాల అగస్టిన్ రూ.10వేలు, పిపుల్స్ ట్రస్ట్ సభ్యులు రూ.50వేలు రూపాయాల చొప్పున్న మొత్తం రూ.2.35లక్షల ఆర్థిక సహయంతో పాఠశాలకు నూతన భవనం నిర్మించారు. శనివారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని కిందుగూడ పాఠశాల భవనం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి కోడా కృష్ణమూర్తి, ట్రస్ట్ సభ్యులు, తల్లిదండ్రులు రిబ్బన్ కత్తిరించి, నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈవో కృష్ణమూర్తి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల పాఠశాలకు భవన సమస్య తీర్చేందుకు ట్రస్ట్ సభ్యుల సేవలు అభినందనీయమన్నారు. భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, భవనం సమకూరడంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. పాఠశాల భవనం లేక తమ పిల్లలు అవస్థలు పడ్డారని, ప్రభుత్వం, అధికారులకు అనేకసార్లు విన్నవించిన స్పందన కరువైయిందని, మా పిల్లల బాధను తీర్చిన పిపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్థిక సహయం అందించిన దాతలకు కిందుగూడ గ్రామ గిరిజనులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, హర్షం వ్యక్తం చేశారుఅనంతరం ఎంఈవో కృష్ణమూర్తి, ట్రస్ట్ సభ్యులకు దుశ్శాలువాలు కప్పి సత్కరించారు. ఉపాధ్యాయురాలు గ్లోరి, సీఆర్‌పీలు సురేష్, సూర్య, అనిల్, గౌరి, హరి, భాస్కర్, విద్యా వలంటీర్ నవీన్, అధిక సంఖ్యల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్వచ్ఛంద సంస్థ, దాతల ఔదార్యంతో పాఠశాలకు భవనం