
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు
కశింకోట: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న దాదాపు అరకోటి రూపాయల విలువైన 262 కిలోల గంజాయిని శనివారం కశింకోటలో పోలీసులు పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రవాణాకు వినియోగించిన స్కార్పియో, స్కూటీ, 4 సెల్‌ఫోన్లు, రూ.3200 స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి తమిళనాడుకు ప్యాకెట్ల రూపంలో బస్తాల్లో గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో స్థానిక సత్తెమ్మతల్లి మలుపు వద్ద ఎస్‌ఐలు కె. లక్ష్మణరావు, పి. మనోజ్‌కుమార్, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్కూటీ, స్కార్పియో వాహనాలు అనుమానాస్పదంగా రావడం గమనించారు. పోలీసులను చూసిన వెంటనే స్కూటీపై ఇద్దరు వ్యక్తులు, కారులోని ముగ్గురు వ్యక్తులు వాహనాలను నిలిపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం నిట్టపుట్టు గ్రామానికి చెందిన అనుగూరి కొండబాబు, కె. కోటపాడు మండలం పైడంపేట గ్రామానికి చెందిన స్కార్పియో డ్రైవర్ చిరికి రాఘవ, బండారు గణేష్, పెదబయలు మండలం బొడ్డగొంది గ్రామానికి చెందిన అనుగూరి సోమేష్‌కుమార్‌లను పోలీసు బృందం పట్టుకుంది. స్కార్పియోలో గంజాయి ఉన్నట్లు ఒప్పుకోవడంతో దాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఒకరు మాత్రం పరారయ్యాడు. అతన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ డోమలొడ్డు గ్రామస్తునిగా గుర్తించారు. ఇతడితోపాటు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా పనికిబండ గ్రామానికి చెందిన వంతల ధనుర్జయ్, తమిళనాడుకు చెందిన రమేష్ ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. వీరిని పట్టుకోవడానికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గంజాయి పట్టుకున్నందుకు సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.
కశింకోటలో నలుగురు నిందితుల అరెస్టు
262 కిలోల గంజాయి, స్కార్పియో, స్కూటీ స్వాధీనం
మరో ముగ్గురు పరారీ