
గంజాయి రవాణాకు దూరంగా ఉండండి
గిరిజనులకు చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా సూచన
మోతుగూడెం: గిరిజనులు గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్‌మీనా హెచ్చరించారు. వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని పాలగెడ్డ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల నుంచి గంజాయి సరఫరా, రవాణా చేస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసిన, రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఒకసారి గంజాయి కేసులో ఇరుక్కుంటే వారిపై స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారి కదలికలను నిరంతరం తెలుసుకుని, వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి కేసులో ఇరుక్కుంటే గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను సైతం సీజ్ చేస్తామన్నారు. గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషకం అందిస్తామన్నారు. అనంతరం ఏఎస్పీ డొంకరాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. మావోయిస్టులు, గంజాయి సరఫరా చేసే వారిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్‌కు పలు సూచనలు చేశారు.