
పెరుగుతున్న తాండవ నీటిమట్టం
370.10 అడుగులకు చేరిక
నాతవరం (అనకాపల్లి): తాండవ రిజర్వాయరులో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుందని ప్రాజక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ నీటిమట్టాన్ని పరిశీలించారు. తాండవ కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. గురువారం సాయంత్రానికి రిజర్వాయరులో నీటిమట్టం 370.10 అడుగులకు చేరిందన్నారు. 350 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. ప్రమాదస్థాయి నీటిమట్టం 380.0 అడుగులుగా పరిగణిస్తామన్నారు. రెండు జిల్లాల్లోని 52 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరు సరఫరా చేయాలంటే ప్రాజెక్టులోకి మరింత నీరు చేరాలన్నారు. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీలోపు ఆయకట్టుకు నీరు విడుదల చేయడానికి ఇటీవల నీటి సంఘాలు తీర్మానించాయన్నారు.
ఏజెన్సీలో వర్షాలకు..
కోటవురట్ల (అనకాపల్లి): ఎగువ ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరాహ నదిలోకి కొంచెం కొంచెంగా ప్రవాహం వస్తోంది. పాతరోడ్డు సమీపంలో వరాహ నదిలోకి సర్పానది కలియడంతో ఇక్కడ నీటి ప్రవాహం పెరుగుతోంది. గొట్టివాడ, పందూరు ప్రాంతాలలో ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.