
రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేస్తాం
రాజవొమ్మంగి: మండలంలో గత రెండేళ్లుగా వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలచిపోయిన బీటీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ రంపచోడవరం ఈఈ శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోడానికి కారణమైన అన్ని అడ్డంకులను అధిగమించి సెప్టెంబర్ మాసాంతానికి రహదారి పనులను పూర్తి చేస్తామని ఆయన ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలు స్థానిక మండల పరిషత్ ఎదుట వంటావార్పు చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆ రోజు ఆందోళన కారులకు ఇచ్చిన హామీ మేరకు అధికారులు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు చుండ్రు లోవకుమారి, చికిలింత, కొండపల్లి సర్పంచ్‌లు కోండ్ల సూరిబాబు, కుంజం జగన్నాథం, సంబంధిత గ్రామపెద్దలు, రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ మండలానికి రూ. 12.5 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో ఏడు బీటీ రోడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రెండు రోడ్లు మాత్రమే పూర్తి చేయగలిగామన్నారు. నిర్మాణం పూర్తయిన రోడ్లకు ఇంత వరకు రూ.4 కోట్ల మేర బిల్లులు చెల్లించగా, ఇంకా రూ. 2.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపు పెండింగ్‌లో ఉందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి మిగిలిన రోడ్డు పనులు పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. రాజవొమ్మంగి నుంచి అప్పరాజుపేట మీదుగా అమ్మిరేఖల రోడ్డు, రాజవొమ్మంగి నుంచి వయ్యేడు మీదుగా బూరుగపల్లి రోడ్డు, లబ్బర్తి ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి డి.మల్లవరం రోడ్డు, లబ్బర్తి నుంచి కిండ్రకాలనీ రోడ్డు, లోదొడ్డి నుంచి పాకవెల్తి రోడ్డు, జడ్డంగి నుంచి సింగంపల్లి తదితర ఏడు రోడ్ల నిర్మాణం పది రోజుల్లో మొదలు పెట్టి దశలవారీగా పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధులకు ఈఈ హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు కోరారు. ఈ సమావేశంలో డీఈ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ ఈఈ శ్రీనివాస్