
పశువుల పెంపకంలోనూ యాజమాన్య పద్ధతులు పాటించాలి
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజు
పాడేరు : పశువుల పెంపకంలో కూడా యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజు అన్నారు. మంగళవారం మండలంలోని లగిసపల్లి పశువుల వసతి గృహాన్ని సందర్శించారు.ఎంపిక చేసిన రైతులతో సమావేశం నిర్వహించారు. రోజుకు 30 కిలోల పచ్చిగడ్డి, రెండు కిలోల ఎండు గడ్డి, 4కిలోల దాణాను అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక పాల దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న పశుదాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువుల హాస్టల్‌లో సరిపడా పచ్చగడ్డి పెంపకం, నీటి సదుపాయం కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిను ఎంపిక చేసి ఇవ్వాలని స్థానిక ఏపీఎంకు సూచించారు. స్థానిక పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ ఆస్పత్రిలో సజ్జా గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు స ద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ బి. రవి, కె. సురేష్, వెలుగు ఏపీఎం చిన్నారావు, వెటర్నరీ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.