
మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్త పెను సమస్య
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర
బీచ్‌రోడ్డు(విశాఖ): మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం, ఏటీఎస్‌ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్‌ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదవారు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చక్కని జీవితం, ఉద్యోగం, పెళ్లి పేరు తో నమ్మించి..వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం ప్రభుత్వంలోని వివిధ శాఖలతో పాటు ఈఅంశంపై పోరాటాలు చేస్తున్న రాష్ట్రంలోని 16 ప్రభుత్వేతర (ఎన్‌జీఓ) సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.
పైడితల్లి అమ్మవారి పూజారి లండ మృతి
సింహాచలం: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పూజారి, 98వ వార్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ లండ వెంకటరమణ(45) మంగళవారం మృతిచెందారు. ఈ నెల 27న గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నగరంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.