నెల్లూరు(బృందావనం): ‘పద్మావతినగర్‌లోని సాయిదర్బార్ అద్దాల మందిర అనుబంధ సాయిమాత నిత్య అన్నప్రసాదాలయం ద్వారకామాయి పంచమ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులు జరుగుతాయి. బుధవారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తాం’ అని ఆ మందిర కమిటీ మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్, షిర్డీ సాయి ధర్మ పరిరక్షణ సేవాసమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసాయి తెలిపారు. ఆహ్వాన పత్రికలను అన్నప్రసాదాలయంలో సోమవారం ఆవిష్కరించారు. మంగళవారం ‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి’ నామ సంకీర్తన, అనంతరం అన్నప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత పెనుశిల లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తామన్నారు. భక్తులకు కల్యాణ తలంబ్రాలు, ముత్యాలు కానుకగా ఇస్తామన్నారు. రెండు రోజులు విశేషంగా నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాయిదర్బార్ భజన, సత్సంగ, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


