ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో ‘గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (వీబీజీ రామ్ జీ), ఘన వ్యర్థ నియమాలు–2026’పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద గత ఉపాధిహామీ కంటే ఎక్కువ మెటీరియల్ పనులకు అవకాశం ఉందన్నారు. పాఠశాలల్లో నూతన గదులు, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శౌచాలయాల నిర్మాణం, మరమ్మతు పనులను ఈ పథకం ద్వారా చేపట్టవచ్చన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ నరసింహులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీఓ రమేశ్, డీఆర్డీవో రవీందర్, జెడ్పీ సీఈవో రవి, పంచాయతీరాజ్ ఈఈ శివరాం, గ్రామీణ నీటి సరఫరా ఈఈ చంద్రమోహన్, డీఎల్పీవోలు ఫణిందర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పపువ్వు లడ్డూ కేంద్రం ప్రారంభం
పట్టణంలోని గణేశ్‌నగర్‌లో గేడం లీలావతి ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డూ విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిషా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డూతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రక్తహీనతతో బాధపడే వారికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లీలావతి, రాము, తదితరులు పాల్గొన్నారు.
మీసేవ కేంద్రాల్లో యూరియా స్లాట్‌బుకింగ్
ఇకనుంచి మీసేవ కేంద్రాల్లో యూరియా స్లాట్ బుకింగ్ చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు.
నైపుణ్య శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ నిరుద్యోగ యువత ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూర్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో చిన్నతరహా పరిశ్రమలు, సేవా రంగంలో స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా సరికొత్త కోర్సులు
క్రీడా విశ్వ విద్యాలయం ద్వారా సరికొత్త కోర్సులు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడ శాఖ మంత్రి వాకటి శ్రీహరి, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజియోథెరపి, కౌన్సెలింగ్ వంటి క్రీడా అనుబంధ రంగాల్లో డిప్లమా పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రీడా పాఠశాలకు నూతనంగా ఏర్పాటు చేసిన హై జంప్ మ్యాట్, మల్టీ డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ, రాష్ట్ర స్థాయి మెడలిస్టుల సౌకర్యార్థం రూ.4.95 లక్షల ప్రభుత్వ గ్రాంట్ నిధులతో అత్యాధునిక హై జంప్ మ్యాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. త్వరలోనే స్విమ్మింగ్ పూల్ వద్ద టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామన్నారు. స్కూల్ ప్రాంగణంలో గీజర్ ఏర్పాటుతో పాటు పెయింటింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో దయానంద్ రెడ్డి, డీటీఎస్‌వో పార్థసారథి, క్రీడా శిక్షకులు రాజు, రమేశ్, శ్రీధర్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.


