ఆదిలాబాద్‌టౌన్: బట్టిసావర్ గ్రామ శివారులోని సర్వే నం.72/3లో ఉన్న అసైన్డ్ భూమిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన సతీమణి పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలపై కలెక్టర్ తక్షణమే న్యాయ విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ భూదందాల ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. పేదలకు నివాస స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుండగా, అక్రమ భూ వ్యవహారాలకు సహకరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతున్న ప్రభుత్వం ఎమ్మెల్యేపై విచారణ చేపట్టడంలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. న్యాయ విచారణకు ఎమ్మెల్యే సహకరించి తన పారదర్శకతను నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, ఆత్రం కిష్టన్న, నాయకులు కోట్నక్ సక్కు, రాములు, తదితరులు పాల్గొన్నారు.


