వదిలేశారు.. | - | Sakshi
Sakshi News home page

వదిలేశారు..

Jun 25 2026 12:12 AM | Updated on Jun 25 2026 12:12 AM

వందన్నారు..

చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రధాన సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప దానికి తదనుగుణంగా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దానికి తోడు వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. ఈ ఆస్పత్రికి డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలతో పాటు పొరుగునే వున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోగులు వస్తారు. ప్రతి రోజూ 200 నుంచి 300 వరకు ఓపీ ఉండగా, సుమారు 60 నుంచి 80 వరకు ఇన్‌ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇవి కాకుండా డయాలసిస్‌, పిల్లల విభాగం, కాన్పు విభాగాలు అదనంగా ఉన్నాయి.

రోగుల అవస్థలు

కీలక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు లేకపోవడంతో ఆస్తమా, ఉబ్బసం, గుండె సంబంధిత, మూర్చ వంటి రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు అన్ని శస్ర చికిత్సలకు గుండెకాయ లాంటి మత్తు వైద్యుడు లేకపోవడంతో మిగతా వైద్యులు కూడా వైద్యం చేసేందుకు వెనుకాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా గర్భిణులకు కాన్పు సమయంలో మత్తు వైద్యుడి అవసరం ఎంతో ఉంటుంది. గత నెలాఖరు వరకు మత్తు వైద్య నిపుణుడితో పాటు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్‌ కోటిరెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి మత్తు వైద్యుడిని నియమించక పోవడంతో శస్త్ర చికిత్సలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

భద్రాచలం ఆస్పత్రికి రిఫర్‌

ప్రస్తుత గైనకాలజిస్టులు సాధారణ కాన్పులు చేస్తున్నా మత్తు వైద్యుడు లేకపోవడంతో శస్త్ర చికిత్సలు అవసరమున్న వారిని తెలంగాణలోని భద్రాచలానికి రిఫర్‌ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు చింతూరు ప్రభుత్వాస్పత్రిలో 48 కాన్పులు జరుగగా వాటిలో 35 సాధారణ కాన్పులు జరిగాయి. మరో 13 మందిని శస్త్ర చికిత్సల కోసం భద్రాచలం రిఫర్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే బ్లడ్‌ బ్యాంకు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గర్భిణులకు అత్యవసర సమయంలో రక్తం ఎక్కించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వైద్య నిపుణుల పోస్టుల ఖాళీ

ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బిడ్డింగ్‌ ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో ఈ ఆస్పత్రికి వైద్య నిపుణులను నియమించారు. వారు కోరుకున్న వేతనానికి జనరల్‌ ఫిజీషియన్‌, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రీషియన్‌, ఈఎన్‌టీ, అనస్తిషిస్ట్‌, గైనకాలజిస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొమ్మిది మంది వైద్య నిపుణులు ఉండాల్సిన ఆస్పత్రిలో నలుగురు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆర్థోపెడిక్‌, నేత్ర వైద్యుడు, ఇద్దరు గైనకాలజిస్టులు విధులు నిర్వహిస్తుండగా, కీలకమైన జనరల్‌ ఫిజీషియన్‌, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రీషియన్‌, మత్తు వైద్యుడు, డెంటిస్ట్‌ లేరు.

ఐదు నెలల క్రితం అప్‌గ్రేడ్‌

50 పడకలతో ఉన్న చింతూరు ప్రభుత్వాస్ప త్రిని వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాలకు రూ.30.50 కోట్లు, వైద్యులు, సిబ్బందితో సహా 52 మంది భర్తీ కోసం మరో రూ 3.44 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా జారీ చేసి ఐదు నెలలు గడుస్తున్నా నేటికీ వంద పడకల అప్‌గ్రేడ్‌ ఊసే ఎత్తడం లేదు. దీంతో 50 పడకల ఆస్పత్రిగానే కొనసాగుతోంది.

చింతూరు ఆస్పత్రిని వంద పడకలకుఅప్‌గ్రేడ్‌ చేస్తూ జీవో

జారీ చేసి ఐదు నెలలైనా పట్టించుకోని వైనం

ఇప్పటికే వేధిస్తున్న వైద్యుల కొరత

మత్తు వైద్యుడు లేక అవస్థలు

ఆపరేషన్‌ కేసులు భద్రాచలం ఆస్పత్రికి రిఫర్‌

మాటలకే పరిమితం

కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందనడానికి చింతూరు ప్రభుత్వాసుపత్రే ఉదాహరణ. వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఐదు నెలల క్రితం జీవో ఇచ్చినా దానిని అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి కరవైంది.

– కుంజా శ్రీను,

ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వైద్యుల భర్తీకి నివేదిక

వైద్య నిపుణుల భర్తీ కోసం కలెక్టర్‌తో పాటు డీసీహెచ్‌ఎస్‌కు నివేదిక అందించాం. మత్తు వైద్యుడు లేకపోవడంతో శస్త్ర చికిత్సల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అలాంటి వారికి బయటకు రిఫర్‌ చేస్తున్నాం.

– డాక్టర్‌ వాడపల్లి దివ్య, సూపరింటెండెంట్‌, చింతూరు ప్రభుత్వాసుపత్రి

మత్తు వైద్యుడిని నియమించాలి

చింతూరు ప్రభుత్వాసుపత్రిలో మత్తు వైద్యుడిని వెంటనే నియమించాలి. మత్తు వైద్యుడు లేకపోవడంతో గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సల కోసం భద్రాచలం రిఫర్‌ చేస్తుండడంతో ఆర్థికంగా భారమవుతోంది.

– సీసం సురేష్‌, గిరిజన సంఘం జిల్లా నాయకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement