నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు

Jun 25 2026 12:12 AM | Updated on Jun 25 2026 12:12 AM

గంగవరం: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాఽధికారి (ఏజన్సీ) వై.మల్లేశ్వరరావు అన్నారు. మండలంలోని నెల్లిపూడి, గంగవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను మండల విద్యాశాఖాధికారి – 2 టి.మల్లేశ్వరరావుతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షించారు. నెల్లిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 176 మంది విద్యార్థులకు గాను 117 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు. నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. అనంతరం గంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ పాఠశాలలో 73 మందికి 56 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులంతా ప్రతిరోజూ సమయానికి పాఠశాలకు వచ్చి లీప్‌ యాప్‌లో హాజరు నమోదు చేయాలని సూచించారు.

3, 4 తేదీల్లో

అల్లూరి జయంత్యుత్సవం

అడ్డతీగల: పైడిపుట్టలోని రచ్చబండ వద్ద అల్లూరి శ్రీరామరాజు జయంత్యుత్సవాన్ని జూలై 3వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు అల్లూరి శ్రీరామరాజు యువజన సంఘం సభ్యులు బుధవారం ప్రకటనలో తెలిపారు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జ్యోతి వెలిగించిన ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అతిథులకు సత్కారాలు, అల్లూరి జీవిత చరిత్ర బుర్రకథ ఉంటుందన్నారు. 4న అల్లూరి జయంతి రోజు గంగాలమ్మకు విశేష పూజలు, హోమం, ఆయుర్వేద వనమూలికల ప్రదర్శన ఉంటుందన్నారు. డాక్టర్‌ రవివర్మచే ఆరోగ్య చిట్కాలు – అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం సభ నిర్వహించి గౌరవ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. అల్లూరి స్ఫూర్తిని నలుదిశలా వ్యాపింప చేయడానికి చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.

బాల కార్మిక వ్యవస్థనిర్మూలనకు చర్యలు

రంపచోడవరం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు వారి రక్షణ, పునరావాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ కె.దినేష్‌ కుమార్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. దానిలో భాగంగా జూన్‌ 23 నుంచి 30 వరకు చైల్డ్‌ లేబర్‌ రెస్క్యూ అండ్‌ రీహాబిలిటేషన్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, వీఆర్‌ పురం, కూనవరం, వై.రామవరం, గూర్తేడు, చింతూరు, ఎటపాక తదితర మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. తనిఖీల్లో గుర్తించిన బాల కార్మికులను వెంటనే రక్షించి, చట్టపరమైన చర్యలతో పాటు పునరావాస కార్యక్రమాలు చేపడతామన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గమనిస్తే 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.

రత్నగిరి కిటకిట

అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో, రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. భక్తుల వాహనాలతో పార్కింగ్‌ స్థలాలు సైతం నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని సన్నిధికి వచ్చారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. జ్యేష్ట ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఉదయం 7 గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, 9 గంటలకు కుంకుమార్చన నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement