అన్నవరం: ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం ఒకవైపు ఒరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఆదివారం గుర్తించారు. దీనిని కిందికి దించి, సంప్రోక్షణ అనంతరం తిరిగి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒరిగిన ఆ చక్రాన్ని అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్‌లు పండితుల మంత్రోచ్చారణల నడుమ బుధవారం తొలగించి, కిందకు దించారు. అనంతరం దర్బారు మండపంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన పూజలు చేసి ఒంగిన సుదర్శన చక్రాన్ని సరి చేశారు. దీనికి గురువారం ఉదయం ప్రత్యేక పూజలు చేయనున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం చేసిన అనంతరం, 9 గంటలకు పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని తిరిగి ధ్వజస్తంభంపై అమర్చుతారు. అక్కడ కూడా అభిషేకం చేసి, సుదర్శన చక్రానికి బూర్లు నివేదిస్తారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
జన్మ నక్షత్రం అభిషేకం
టికెట్టు రూ.5 వేలకు పెంపు
సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులకు నిర్వహించే మహన్యాస పూర్వక అభిషేకం టికెట్టును భారీగా పెంచేశారు. ఇప్పటి వరకూ రూ.3 వేలు ఉన్న ఈ టికెట్టును ఏకంగా రూ.5 వేలకు పెంచారు. దీనికి దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు బుధవారం నిర్వహించిన దేవస్థానం పాలక మండలి సమావేశంలో వెల్లడించారు. ఈ టికెట్టుతో ఒక జంట ఈ అభిషేకంలో పాల్గొనవచ్చు. యంత్రాలయంలో ప్రదక్షిణ దర్శనం టికెట్టును కూడా రూ.50 నుంచి రూ.100కు పెంచారు. ఈ పెంపుదల జూలై 1 నుంచి అమలులోకి రానుంది.
నేడు సంప్రోక్షణ, పునఃప్రతిష్ఠ


