గంగవరం: గ్రామాల్లో భూమి రీసర్వే, ఓటర్ల నమోదు ఇంటింటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం వేములోవ గ్రామంలో ఆ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం భూములను రీ సర్వే చేసే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. భూములకు హద్దులు వేసే సమయంలో ఎటువంటి భూతగాదాలు లేకుండా చూడాలన్నారు. సర్వే బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో భూయజమానులు సంబంధిత పత్రాలను, ఆధారాలను సిద్ధంగా ఉంచుకుని, అధికారులకు సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని జేసీ అన్నారు. 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఆశ్రమ పాఠశాల తనిఖీ
వేములోవ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను జేసీ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకం మెనూను పక్కాగా అమలు చేయాలని, విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గంగవరంలో రేషన్ డిపో, గ్రామ సచివాలయాన్ని జేసీ తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విజయ భాస్కర్, తహసీల్దార్ చిన్నం శ్రీనివాసరావు, ఎంపీడీవో వై.లక్ష్మణరావు ఉన్నారు.


