సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): పేర్ణమిట్ట లోని లింగారెడ్డి కాలనీలో మంగళవారం మండల బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర విచారణ (సర్ ) ఫై బీజేపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సెల్ కో కన్వీనర్ డాక్టర్ నిడమానూరి నాగేశ్వరరావు, సెగ్గం శ్రీనివాసరావులు, బాలినేని కళ్యాణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్):మండలంలోని మద్దులూరు సమీపంలో గల మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు వేములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. 149 మందికి మెడికల్ ఆఫీసర్ జగదీష్ వైద్య సేవలు అందించారు. సార్డ్స్ సంస్థ ప్రతినిధులు పి.సంధ్య, జి. మధు, వేములపాడు వైద్యారోగ్య శాఖ సిబ్బంది హాజరయ్యారు.
నాగులుప్పలపాడు: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ అధ్యక్షులు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు శాశ్వత ఆహ్వానితులతో పాటు అన్ని శాఖల అధికారులు తగు సమాచారంతో హాజరు కావాలని కోరారు.
కొత్తపట్నం: మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ కోసం అవసరమైన స్థలాన్ని కలెక్టర్ రాజాబాబుతో పాటు ప్రజాప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. అనంతరం కె.పల్లెపాలెం నుంచి మడనూరు వరకు సముద్ర తీరంలో ప్రత్యేక వాహనాల్లో పర్యటించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ డి.రామానాయుడు పాల్గొన్నారు.
● బాల కార్మికుల కేసులపై సమీక్ష
● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు
ఒంగోలు సబర్బన్: బాలల హక్కుల పరిరక్షణలో అధికారులంతా పూర్తి భాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీవీయస్ సూర్య నారాయణ రాజు అన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కమీషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబుతో కలిసి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగాలు,కార్మిక శాఖ, విద్యా శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, బాలలతో కలసి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.నాగమణి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల కాలంలో నమోదైన బాలకార్మిక కేసులు ఎన్ని, వీరికి ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్‌పై ఎటువంటి చర్యలు చేపట్టారు, లబ్ధి పొందిన వారి పూర్తి వివరాలపై కార్మిక శాఖాధికారులు నుంచి ఆరా తీశారు. అలాగే జిల్లాలో గత రెండేళ్లుగా జరిగిన బాల్య వివాహాల కేసులు ఎన్ని నమోదు జరిగాయి, పోలీసులు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు బుక్ చేశారు, బాండెడ్ లేబర్‌లో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత మంది బాలికలను తిరిగి బడి లో చేర్పించారని వివరాలు రాబట్టారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో బాలల హక్కుల ఉల్లంఘనలు ఏ రూపంలో జరుగుతున్నాయి, విద్యా శాఖ, చైల్డ్ లైన్ విభాగం, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఎలా వీటిని ఎలా అధిగమిస్తున్నారో కూలంకషంగా చర్చించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్ని స్కూల్స్ బస్సులు కండిషన్‌లో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.


