కొత్తపట్నం: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేసేందుకు మెడికల్ సిబ్బంది, ప్రజా పతినిధులు, చిన్నారుల తల్లిదండ్రులు సహకరించాలని కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ శ్రావ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌వోలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలను పోలియో వ్యాధి నుంచి సంపూర్ణంగా రక్షించేందుకు సున్నా నుంచి 5 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. గతంలో ఎన్నిసార్లు పోలియో చుక్కలు తీసుకున్నప్పటికీ, ఈ విడతలో కూడా పిల్లలకు చుక్కలు వేయించడం అవసరమని తెలిపారు. కొత్తపట్నం పీహెచ్ పరిధిలో సున్నా నుంచి 5 సంవత్సరాలు వయస్సు గల చిన్నారులు 2,906 లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా 11 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ నివసిస్తున్న 10 మంది చిన్నారులకు ప్రత్యేక దృష్టి సారించి పోలియో చుక్కలు అందించనున్నట్లు తెలిపారు. బూత్ నిర్వహణ, ఇంటింటి సర్వే, మైక్రోప్లాన్ అమలు, పిల్లల గుర్తింపు మార్కింగ్ విధానం హైరిస్క్ ప్రాంతాల పర్యవేక్షణ, వలన కుటుంబాల పిల్లల గుర్తింపు, బూత్ అనంతరం ఇంటింటి సందర్శనలు వంటి అంశాలపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ఒక్క చిన్నారికీ తప్పకుండా వేయాలని అవగాహన కల్పించాలని సూచించారు. జలుబు, దగ్గు లేదా స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటీకీ పోలియో చుక్కలు వేయించవచ్చుని శ్రావ్య తెలిపారు.


