ఒంగోలు వన్‌టౌన్: విజయవాడలో పోలీసుల వేధింపులు భరించలేక బలవన్మరణం పొందిన క్రాంతి మాదిగ కేసులో నిందితుడైన సీఐ నాగరాజును వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు కులానికి చెందిన సాయి కృష్ణను విజయవాడ కృష్ణ లంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు టార్చర్ చేసి.. హత్య చేయడంతో పాటు కనీసం శవం కూడా లేకుండా చేశారన్నారు. శ్మశానంలో కూడా సాయి కృష్ణ వయస్సు 25 సంవత్సరాలు అయితే 45 సంవత్సరాలుగా నమోదు చేసి గుర్తు తెలియని శవంగా దహనం చేశారన్నారు. ప్రతి పక్షాల పరామర్శలు, ఆందోళనలతో ప్రభుత్వం ఎట్టకేలకు సీఐపై కేసు నమోదు చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసిందన్నారు. కానీ అదే పోలీస్ స్టేషన్లో అదే సీఐ నాగరాజు వేధింపులకు గురై బలన్మరణం పొందిన క్రాంతి మాదిగ కేసులో ఎటువంటి చర్యలు లేవన్నారు. క్రాంతి మాదిగ బలవన్మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో సీఐ తనతో బూట్లు పాలిష్ చేయించారని, అనేక చిత్రహింసలకు గురి చేశారని మనోవేదన చెందారన్నారు. తన మరణానికి సీఐ కారణమని విడియో సాక్ష్యం ఉన్నా ఇంత వరకూ కేసు నమోదు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాదిగ కుల మృతుని పట్ల వివక్షత చూపించిందన్నారు. సీఐ నాగరాజు, ఇతర పోలీస్ అధికారులపై చట్ట ప్రకారం బీఎన్‌ఎస్ సెక్షన్ 108, ఎస్సీ ఎస్టీ యాక్ట్‌గా మార్చాలన్నారు. పెద్ద మాదిగను అన్న చంద్రబాబుకు మాదిగల ప్రాణాల పట్ల ఉన్న ప్రేమకు ఈ సంఘటన నిదర్శనం అన్నారు. ఖాకీ క్రౌర్యానికి బలైన కాపు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని ఓదార్చిన ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన వెంకటేశ్వరరావు మాదిగ కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధారా అంజయ్య, కాకుమాను రవి, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ పట్రా బంగారం, మాల సభత కన్వీనర్ మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు.


