మద్దిపాడు: ఏపీఏఐ ఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సులభంగా సురక్షితంగా పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మద్దిపాడులో జరుగుతున్న రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. ఇ. మంజుల మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా సముద్ర ఉపరిత ఉష్టోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడం వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువలన రైతులు తక్కువ నీటితో పండే పంటలను పండించుకోవాలని సూక్ష్మనీటి సాగు పద్ధతులను పాటించాలని తెలిపారు. అంతే కాకుండా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫాం పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు సబ్‌డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వలన నేల తేమను నిల్వ ఉంచుతుందన్నారు. జిల్లా వ్యవసాయ వనరుల శాఖ అధికారి ఏ. శైలజరాణి మాట్లాడుతూ భూసారం ప్రాముఖ్యతను వివరించి పచ్చిరొట్ట పంటలు, ఎరువుల గురించి రైతులకు వివరించారు. అనంతరం మద్దిపాడులో రైతుకు పీఎండీ కిట్ అందించారు. ఇందులో 32 రకాల విత్తనాలు పంట సాగుకు కానీ పచ్చిరొట్ట ఎరువుగా అయినా వినియోగించుకోవడానికి వీలుగా కిట్‌లు తక్కువ ధరకే అందిస్తున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ఆత్మ బీటీఎం శేషారావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు.


