అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న ట్రస్ట్‌బోర్డు సమావేశంలో రూ.నాలుగు కోట్లతో చేపట్టే వివిధ నిర్మాణాలపై చర్చ జరుగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ పనులు ప్రతిపాదించారు. అయితే అన్నవరం దేవస్థానం 2026–27 వార్షిక బడ్జెట్‌లో వివిధ నిర్మాణాలకు రూ. ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే దేవస్థానంలో రూ.15 కోట్లతో 105 గదుల సీతారామ సత్రం మొదటి దశ నిర్మాణం జరుగుతోంది. గోదావరి పుష్కరాల కల్లా ఈ సత్రం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ సత్రం నిర్మాణానికే బడ్జెట్‌లో పూర్తిగా నిధులు కేటాయించని పరిస్థితిలో అదనంగా రూ.నాలుగు కోట్లతో ఎలా నిర్మాణాలు చేపడతారనే దానిపై కొంతమంది ట్రస్ట్‌బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుఽధవారం జరగనున్న ట్రస్ట్‌బోర్డు సమావేశం అజెండా కాపీలు అందుకున్న ట్రస్ట్‌బోర్డు సభ్యుల్లో కొందరు మంగళవారం దేవస్థానంలో సమావేశమై ఈ నిర్మాణ పనులపై చర్చించినట్టు సమాచారం.


