మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

మన్యం మంచం పట్టింది.. జ్వర పీడితులతో అల్లాడుతోంది.. ఏ ఇల్లు చూసినా బాధితులతో కనిపిస్తోంది.. ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన మలేరియా మళ్లీ క్రమంగా పెరుగుతోంది.. కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలో పారిశుధ్య సమస్య కారణంగా దోమల ఉధృతి అధికమైంది. వీటి నివారణ చర్యలు కానరాక మలేరియా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే..

ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులు

రంపచోడవరం: మన్యంలో మలేరియా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. జిల్లాలో ఈ జ్వరాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గిరిజనులు జ్వరాలతో మంచం పట్టడం కనిపిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మలేరియా మళ్లీ క్రమంగా కోరలు చాచింది. గ్రామాల్లో జ్వర పీడితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుంటే, ఒక రోజు చికిత్స అనంతరం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో వచ్చిన రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. ఇందులో గతం నుంచి మలేరియా తీవ్రతగా ఎక్కువగా ఉన్న మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతంలో ప్రస్తుతం మలేరియా జ్వరాలు విభృంజిస్తున్నాయి. ఈ రెండు మండలాల్లోని 20 గ్రామాల్లో ఈ కేసులు అధికమవుతున్నాయి. కలెక్టర్‌ కె.దినేష్‌ కుమార్‌ ఆదేశాలతో జిల్లా మలేరియా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ఆర్డీ కిట్‌లతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ 15 వేల మంది జ్వర పీడితులను పరీక్షలు చేయగా, 620 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అధికారులకే చెమట పుట్టించింది. ఏజెన్సీలో మలేరియా తీవ్రతకు ఇది నిదర్శనం. ఇదిలా ఉంటే మలేరియా కేసులు తక్కువగా చూపేందుకు కొంత మంది సిబ్బంది నెగెటివ్‌ వచ్చినట్లుగా నమోదు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 57 మంది జ్వర పీడితులు ఇన్‌ పేషెంట్‌లుగా చికిత్స పొందుతున్నారు. ఇందులో 49 మంది మలేరియా జ్వర పీడితులే. ఎనిమిది మంది టైఫాయిడ్‌ బాధితులు ఉన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఒక్క రోజే 17 మంది జ్వర పీడితులు చికిత్స కోసం చేరారు.

నివారణ ఎక్కడ!

జిల్లాలో మలేరియా నివారణ మందు స్ప్రేయింగ్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ప్రణాళిక ప్రకారం స్ప్రేయింగ్‌ జరగాల్సి ఉండగా, ఆలస్యం చేశారు. మే నెలాఖరు నాటికి మొదటి విడత స్ప్రేయింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఈ నెల 25 నాటికి మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రెండో విడత జూన్‌ ఆఖరి నాటికి ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 15న మలేరియా నివారణ మందు స్ప్రేయింగ్‌ ప్రారంభించాలి. కాని ఆలస్యం అయ్యింది. ఈ మందు స్ప్రేయింగ్‌ చేసేందుకు మనుషులు దొరకకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. స్ప్రేయింగ్‌ చేసేందుకు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రెండో రౌండ్‌ స్ప్రేయింగ్‌ కూడా ఆలస్యం అవుతుంది. దీనివల్ల దోమల లార్వా మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయా పంచాయతీల పరిధిలో ఫాగింగ్‌ చేయాల్సి ఉండగా, చాలాచోట్ల ఫాగింగ్‌ మెషీన్లు మూలనపడ్డాయి. మలేరియా శాఖ ఫాగింగ్‌ మెషీన్లలో వేసి స్ప్రేయింగ్‌ చేసేందుకు మందు ఇచ్చినా, ఆ మెషీన్‌లో ఆయిల్‌ పోసేందుకు సొమ్ములు లేక పనులు పక్కన బెట్టేశారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో ఫాగింగ్‌ చేసిన పరిస్థితులు కనిపించడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా మలేరియా కార్యాలయం నుంచి మూడు సైజుల దోమ తెరలు 5,37,271 కోసం ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో పోలవరం జిల్లాకు 1,85,811 దోమతెరలు ప్రతిపాదించారు. అయితే పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. దీంతో దోమల నుంచి జనానికి రక్షణ లేకుండా పోయింది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఈ దోమ తెరలు సరఫరా చేశారు. జిల్లాలో మలేరియా ప్రభావిత గ్రామాలు 646 ఉన్నాయి.

ఫ విజృంభిస్తున్న మలేరియా మహమ్మారి

ఫ ఐదు నెలల్లో 620 కేసులు నమోదు

ఫ ప్రస్తుతం రంపచోడవరంలోనే

49 మందికి చికిత్స

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement