చింతూరు: పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా చింతూరు బీసీ కాలనీకి చెందిన తమ్మినీడి వెంకటరామయ్య గృహానికి పరిహారం రావాల్సి ఉంది. సదరు ఇంటికి రూ.4.09 లక్షల విలువ నిర్ధారిస్తూ పోలవరం అధికారులు 2024లో అవార్డు నోటీసు జారీ చేశారు. కాగా ఈ ఏడాది చింతూరుకు చెందిన నిర్వాసితులకు ఆరు నెలల క్రితం గృహాల పరిహారం జమకాగా, వెంకట రామయ్యకు మాత్రం నేటికీ పడలేదు. దీనిపై అప్పటి నుంచి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు. తనకు పరిహారం జమ కాకపోవడంపై ఆరా తీయగా, తన బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన రూ.4.09 లక్షల పరిహారం తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు పోలవరం అధికారులు చెప్పారని అతను వాపోయాడు. సదరు సొమ్మును రికవరీ చేసేలోగానే ఆ వ్యక్తి తన ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకున్నాడని అన్నారు. సదరు సొమ్ము విత్‌డ్రా చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతని నుంచి సొమ్ము రికవరీ చేసి ఇస్తామని జిల్లా, ఐటీడీఏ, పోలవరం కార్యాలయం ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ప్రయోజనం లేదని బాధితుడు వాపోయాడు. పోలవరం కార్యాలయ సిబ్బంది చేసిన పొరపాటుకు తనకు రావాల్సిన పరిహారం సొమ్ము వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వెళ్లిపోయాయని, దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపి తనకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే వచ్చేలా చూడాలని కోరాడు.


