రంపచోడవరం: ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించారు. కలెక్టర్‌తో జేసీ ఎస్.ప్రశాంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేద్కర్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 218 అర్జీలు వచ్చాయి. మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ పరిధి తేనెల మామిడి గ్రామంలో 60 కుటుంబాలకు తాగునీరు అందించాలని వినతి ఇచ్చారు. చావడికోట సెంటర్ నుంచి తేనెల మామిడి గ్రామం వరకు 450 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించాలని, జిల్లాలో డిగ్రీ పాసైన యువతీ యువకులకు గ్రూప్ వన్, గ్రూప్ టు ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇవ్వాలని, 1/70 చట్టం పక్కాగా అమలు చేయాలని, వేములకొండ నుంచి కాకవాడ గ్రామం వరకూ బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని పలువురు అర్జీలు ఇచ్చారు. రాజవొమ్మంగి మండలం కిమ్మలగడ్డలో కొండపోడు వ్యవసాయం చేసుకుంటున్న 15 మంది గిరిజన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అర్జీ సమర్పించారు. ఏపీఓలు జనరల్ డీఎన్వీ రమణ, రామతులసి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ షేక్ షరీఫ్, డీఎంహెచ్‌ఓ (ఇన్‌చార్జ్) నీలిమ, సబ్ డీఎఫ్‌ఓ అనుష, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ దాసరి రత్నాకరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం, జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


