ఒంగోలు సబర్బన్:
కొణిజేడు – మర్లపాడు ఐరన్ ఓర్ మైనింగ్ లీజ్ ప్రతిపాదిత పరిధిలో మైనింగ్‌తో ప్రజలపై ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని కొణిజేడు గ్రామ సహకార కమిటీ కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొణిజేడుతో పాటు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు వచ్చి వారి గోడును వెళ్లబోసుకున్నారు. కొణిజేడులో ఉన్న 529.04 హెక్టార్ల ప్రాంతంలో మైనింగ్ చేసే కలిగే దుష్ప్రభావాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కూడా చాలా వాదోపవాదనలు జరిగి స్థానిక ప్రజల మేలు కోసం ప్రాజెక్టును నిలిపివేశారని గుర్తు చేశారు. ఒక ప్రభుత్వ సంస్థగా స్థానిక ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఏపీఎండీసీపై ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కొణిజేడు, మర్లపాడు, కందులూరు, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపుతుందన్నారు. తవ్వకం, ఖనిజ శుద్ధితో వచ్చే వ్యర్థాలతో వచ్చే విషయువాయువులతో పొందూరు, నిడమానూరు, వెంగముక్కలపాలెం, చెరువుకొమ్మపాలెం, చిలకపాడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కేవలం లాభాల కోసం చూస్తూ గ్రామీణ ప్రజల జీవితాలతో ఆటలాడటం సరికాదన్నారు. ప్రాజెక్టు అమల్లోకి వస్తే దాదాపు 10 గ్రామాల ప్రజలు, పశువులు, పక్షులు, పర్యావరణంతో పాటు భవిష్యత్ తరాలు కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సర్వే ప్రకారం ఈ ప్రాంత పరిధిలో ఉన్న ఐరన్ సాంద్రత కేవలం 29.89 శాతం మాత్రమేనని గుర్తు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుండ్లకమ్మ నుంచి భారీ మొత్తంలో నీటిని వినియోగించి ఏపీ ట్రాన్స్‌కో నుంచి 132 కిలో వాట్ పవర్ లైన్‌కు వృథాగా ఖర్చు చేస్తారన్నారు. ఈ తవ్వకాలతో భూగర్భ జలాల నీటిమట్టం తగ్గిపోయి పంట బోర్లు, నీటి బావులు, చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, క్రషింగ్, రవాణాతో వచ్చే దుమ్ము ధూళి వల్ల చుట్టుపక్కల గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగాలని కోరారు.
అర్జీలపై దృష్టి సారించండి
ప్రజల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్‌ఓ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ శాంతిలక్ష్మిలతో కలిసి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమానికి మొత్తం 275 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీలను పరిష్కరించకుంటే అందుకు కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. తరుచూ అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. అధికారులంతా తమ లాగిన్‌లో పెండింగ్ ఉన్న అర్జీలను ప్రతిరోజూ పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొణిజేడు గ్రామ సహకార కమిటీ ఫిర్యాదు


