ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలి

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలి

ఒంగోలు టౌన్‌: పొగాకు కొనుగోళ్ల కంపెనీల నిలువు దోపిడీకి గురవుతున్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19వ తేదీ ఒంగోలు నగరంలో నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, ఏపీ రైతు కూలీ సంఘ జిల్లా నాయకుడు సీఎస్‌ సాగర్‌, ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు చైతన్య ప్రచార జాతా సోమవారం ఒంగోలు మండలంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పొగాకు రైతులతో జరిగిన సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు. సిండికేట్‌గా ఏర్పడిన పొగాకు కంపెనీలు రైతులను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ ధరకు పొగాకు కొనుగోలు ప్రారంభించారన్నారు. క్వింటా రూ.16 వేలకు కొంటూ రైతుల శ్రమ, సంపదను అడ్డగోలుగా మెక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనుగోలు కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని చెప్పారు. రైతుల జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయని చెప్పారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, రూ.1000 కోట్లు కేటాయించి ఎస్టీసీ, పొగాకు బోర్డు ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు సూదనగుంట శ్రీనివాసులు, సర్పంచ్‌ కామేపల్లి శ్రీనివాసరావు, వీరయ్య, లక్ష్మీనారాయణ, మారుతి, పొగాకు రైతులు పాల్గొన్నారు. అనంతరం కరవది, త్రోవగుంట, మద్దిరాలపాడు గ్రామాల్లో ప్రచార జాతా సాగింది.

నాగులుప్పలపాడు మండలంలో...

నాగులుప్పలపాడు: ఒంగోలులో ఈ నెల 19వ తేదీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ట్రాక్టర్ల ర్యాలీలో రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘ జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు కోరారు. పొగాకు రైతుల సమస్యలపై తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ తలపెట్టిన రైతు చైతన్య ప్రచార జాతా కార్యక్రమం సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని బీ నిడమానూరు, పోతవరం గ్రామాల్లో సాగింది. రైతు సంఘ నాయకులు వడ్డే హనుమారెడ్డి, సాగర్‌, వీరారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement