కోఆప్షన్‌ దక్కేదెవరికో? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ దక్కేదెవరికో?

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

దరఖాస్తుకు నేడు తుది గడువు కూటమిలో కుదరని ఏకాభిప్రాయం ఎంఐఎం, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు బీఆర్‌ఎస్‌లో ఇంకా రాని స్పష్టత బరిలో నిలవాలని బీజేపీ నిర్ణయం

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ కోఆప్షన్‌ పదవులపై నెలకొన్న ఉత్కంఠ వీడటం లేదు. నాలుగు పదవుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. అయినా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలతో కూడిన కూట మిలో పదవుల పంపకాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సందిగ్ధం వీడని పరిస్థితి. ఒక్కో పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్‌, ఎంఐఎంలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో కీలకపాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌లో మాత్రం పదవులను ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. నాలుగు పదవుల్లో మూడు పదవులు తమకే కావాలని ఆ పార్టీ నాయకత్వం పట్టుబడుతుండటంతో చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయా పా ర్టీలు తమ అభ్యర్థులతో దరఖాస్తు చేయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు పోటీలో నిలిపే వారికి సమాచారం కూడా ఇప్పటికే అందజేశాయి. వారు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మూడు పదవులపై బీఆర్‌ఎస్‌ పట్టు..

కోఆప్షన్‌ పదవులు మున్సిపాలిటీలో నాలుగు ఉండగా రెండు జనరల్‌, మరో రెండు మైనార్టీ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇందులో మూడు పదవులను బీఆర్‌ఎస్‌ కోరుతున్నట్లుగా చర్చ సాగుతుంది. మరోవైపు తమకు ఒక్కో సీటు కావాలని కాంగ్రెస్‌, ఎంఐఎంలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూటమిలో శుక్రవారం రాత్రి వరకు కూడా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా ఉంటే ఎంఐఎం తరఫున రాంనగర్‌ వార్డు మాజీ కౌన్సిలర్‌ శనవాజ్‌ ఉర్‌ రహమాన్‌ను కోఆప్షన్‌ మెంబర్‌గా ఎంపిక చేయగా, కాంగ్రెస్‌ తరఫున గతంలో అదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి పాలైన ఖయ్యుంను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే వారికి సమాచారం అందించిన ఆయా పార్టీల నాయకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీఆర్‌ఎస్‌లో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఆశావహుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేనట్లుగా తెలుస్తోంది.

బీజేపీ సైతం..

మొత్తం 49 వార్డులకు గాను 21 మంది కౌన్సిలర్లను గెలుచుకొని బీజేపీ బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓట్లు సైతం ఉన్నాయి. 23 సంఖ్యాబలం ఉన్నప్పటికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. అయితే కోఆప్షన్‌ పదవుల్లో మాత్రం సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. నాలుగు పదవుల కోసం పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. పార్టీలో సీనియర్‌ నాయకులను బరిలో నిలపాలని యోచిస్తోంది. ఎమ్మెల్యే శంకర్‌ ఈ విషయమై శుక్రవారం రాత్రి ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించినట్లుగా సమాచారం. కూటమికే మెజార్టీ ఉండగా, సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం రాకపోవడం బీజేపీకి కలిసిరానుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదవుల్లో కనీసం ఒక్కటైనా దక్కించుకొని తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా ఏ పార్టీకి పదవులు దక్కుతాయి.. ఎవరు దరఖాస్తు చేస్తారనేది తేలిపోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement