నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభోత్సవమా?
ఆదిలాబాద్‌టౌన్: చనాఖా–కొరటా ప్రాజెక్టుకు రూ పాయి కేటాయించని సీఎం రేవంత్‌రెడ్డి పంప్‌హౌస్‌ను ప్రారంభించడం దారుణమని ముఖ్యమంత్రి రాకతో ప్రాజెక్టు కలుషితమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. సీఎం రాకను నిరసిస్తూ ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అడ్డుకున్నారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఉదయమే అక్కడికి చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రామన్నను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆయనతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో, ప్రస్తుతం అలాగే ఉందన్నారు. రెండేళ్ల కాలంలో నిధులు కేటాయించని సీఎంకు పంప్ హౌస్‌ను ప్రారంభించే అర్హత లేదన్నారు. ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని పంప్ హౌస్‌ను ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎన్ని రోజులు తమ వెంటపడ్డా ఏదో ఒక రోజు ప్రాజెక్టు వద్దకు వెళ్లి శుద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
పాలు పోసి.. శుద్ధి చేసి
సాత్నాల: మాజీ మంత్రి రామన్న పిలుపు మేరకు కొరటా–చనాకా శుద్ధి కార్యక్రమంలో భాగంగా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు శనివారం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. గుమ్మడికాయతో దిష్టి తీసి, అక్కడి జలాల్లో పాలు పోసి శుద్ధి చేశారు. ఇందులో ప్రభాకర్, కేశవ్, రూపేష్, గణేష్, ఆశన్న, దేవన్న తదితరులున్నారు.
నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభోత్సవమా?


