గాడిన పడేనా..
విద్యాశాఖలో ఏడేళ్లుగా ఇన్‌చార్జి అధికారులే! ఇష్టారాజ్యంగా కొందరు ఉద్యోగులు, టీచర్లు పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ విద్యార్థుల చదువుపై ప్రభావం నేడు ఇన్‌చార్జి డీఈవోగా రాజేశ్వర్ బాధ్యతలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖకు ఏడేళ్లుగా రెగ్యులర్ అధికారి కరువయ్యారు. దీంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్‌చార్జి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సా రించకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. ఆగస్టులో ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా కనీసం ఒక్కసారి కూడా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అడుగు పెట్టలేదు. అలాగే మూడు నెలల కాలంలో ఏ పాఠశాలను కూడా తనిఖీ చేయలేదు. తాజాగా ఆమె సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి డీఈవోగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
ఏళ్లుగా రెగ్యులర్ అధికారి కరువు
జిల్లా విద్యాశాఖకు ఏడేళ్లుగా రెగ్యులర్ డీఈవో కరువయ్యారు. 2018 నుంచి ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, కొందరు గురువులు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, పాఠశాలల్లో తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడటం, ఇష్టానుసారంగా విధులకు హాజరుకావడం, పాఠశాల నిధులను కాజేయడం, కార్యాలయ ఉద్యోగులు కొంత మంది అక్రమాలకు పాల్పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇన్‌చార్జి అధికారులకు విద్యాశాఖపై అవగాహన లేకపోవడంతో ఇలాంటి పొరపాట్లు పరిపాటిగా మారాయి. 2018లో రెగ్యులర్ అధికారిగా జనార్దన్‌రావు ఉండగా, ఆయనను సరెండర్ చేశారు. ఆ తర్వాత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పనిచేశారు. ఈయనను నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడంతో అక్కడ డీఈవోగా పనిచేసిన ప్రణీతను ఆదిలాబాద్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందారు. దీంతో కలెక్టర్ వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఏప్రిల్ నుంచి జూలై వరకు పనిచేశారు. పనితీరు బాగాలేదని పాఠశాల విద్యా శాఖ నుంచి ఆయనను తప్పించారు. ఆ తర్వాత ఐటీడీఏ పీవోకు ఆగస్టులో ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఉట్నూర్‌లోనే బాధ్యతలు స్వీకరించిన సదరు అధికారి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను అదనపు కలెక్టర్‌కు అప్పగించారు. రాజేశ్వర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో పాటు మున్సిపల్ ప్రత్యేక అధికారి, ఇన్‌చార్జి డీఈవోగా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈయన ఏ మేరకు విద్యాశాఖపై దృష్టి సారిస్తారోనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చించుకుంటున్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
విద్యాశాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సైతం పాఠశాలలను పూర్తిస్థాయిలో సందర్శించడం లేదు. కొంత మంది మండల విద్యాధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, వివిధ కార్యక్రమాల అమలుతీరు, విద్యార్థుల విద్యా ప్రగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఇవి నామమాత్రంగానే సాగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సైతం అందడం లేదనే విమర్శలున్నాయి. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. సాంబర్‌తో పాటు వెజ్ కర్రీ పెట్టాల్సి ఉండగా, పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అలాగే వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంది. ఇది కూడా చాలా పాఠశాలల్లో అమలు కావడం లేదు. చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు సైతం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో కొనసాగడం లేదని తెలుస్తోంది.
గాడిన పడేనా..


