చేప.. వస్తుందోచ్
ఇక జలాశయాల్లోకి మీనం నేడు ‘సాత్నాల’లో సీడ్ విడుదల ఈ ఏడాది టెండర్ల ప్రక్రియలో జాప్యం చేపల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం
కై లాస్‌నగర్: జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఎట్టకేలకు షురూ కానుంది. సాత్నాల ప్రాజెక్టులో చేప సీడ్‌ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టెండర్లు దక్కించకున్న కాంట్రాక్టర్ ఇప్పటికే సీడ్‌ను అందుబాటులో ఉంచారు. అయితే సీడ్ విడుదలలో జాప్యం చేప పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
ఏటా ఉచితంగా పంపిణీ
కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసే బాధ్యతలను కరీంనగర్‌కు చెందిన అభయ్ ఫిష్‌ట్రేడర్స్ దక్కించుకుంది. అదే జిల్లాకు చెందిన రెండు ఏజెన్సీలు టెండర్లను దాఖలు చేయగా నిబంధనల ప్రకారం ఉన్న ఈ సంస్థకు సరఫరా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి జలకలను సంతరించుకున్నాయి.
1.16 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యం
ఈ ఏడాదికి గాను కోటి 16లక్షల చేప పిల్లలను జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో వదలనున్నారు. 35–40 ఎంఎం సైజ్‌తో కూడిన 83 లక్షలు, 90 నుంచి 100 ఎంఎం సైజ్‌తో కూడిన 33 లక్షల కట్లా, రహు, మిరియ రకాల చేప పిల్లలు వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ ప్రణాళికను సిద్ధం చేయగా అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి సరఫరా కోసం కరీంనగర్‌కు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా ఇటీవల జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి అభయ్ ట్రేడర్స్‌ను ఎంపిక చేసింది. సోమవారం సాత్నాల ప్రాజెక్టులో సీడ్ విడుదలను ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మత్తడివాగు ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని ఇతర చెరువుల్లో దశలవారీగా చేప పిల్లలను వదిలేలా మత్స్యశాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
నేటి నుంచి సీడ్ పంపిణీ షురూ
ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సరఫరా కాంట్రాక్టర్లను ఎంపిక చేశాం. సీడ్ సరఫరాను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. తొలుత సాత్నాల ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను విడుదల చేస్తాం. అనంతరం దశలవారీగా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేస్తాం. సీడ్‌సరఫరాలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిపారదర్శకంగా సాగేలా శ్రద్ధ వహిస్తాం. – భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి
ఎదుగుదలపై ప్రభావం..
సాధారణంగా చేప పిల్లలను జూలై, ఆగస్టు మాసాల్లో చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేయాల్సి ఉంటుంది. మరుసటి ఏడాది ఏప్రిల్, మే నాటికి పూర్తిస్థాయిలో చేపలు ఎదిగి విక్రయాలకు అనుకూలంగా ఉంటాయి. తద్వారా మత్స్యకారులకు ప్రయోజనం చేకూరే అవకాశముంటుంది. అయితే టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్ల ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా ఈ ఏడాది సీడ్ విడుదలలో తీవ్ర ఆలస్యమైంది. నవంబర్‌లో సీడ్ విడుదల చేయడం ద్వారా చేప పిల్ల ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడనుందనే అభిప్రాయం మత్స్యకారుల నుంచి వ్యక్తమవుతుంది.
జిల్లాలో..
మత్స్యపారిశ్రామిక సంఘాలు : 107
ఆయా సంఘాల్లోని సభ్యులు : 5040
మొత్తం చెరువులు : 224
రిజర్వాయర్లు : 2 (సాత్నాల, మత్తడివాగు)
ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ
లక్ష్యం: 1.16కోట్లు
35–40 ఎంఎం సైజ్ : 83 లక్షలు
90–100 ఎంఎం సైజ్ : 33లక్షలు


