
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
పలువురికి స్వల్ప గాయాలు కల్వర్టు వద్ద గుంతలో అదుపుతప్పిన వాహనం బెంగళూర్ నుంచి నేపాల్ కు ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా.. సొనాల మండలం సాకెర వద్ద ఘటన
బోథ్: సొనాల మండలం సాకెర గ్రామం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం బోల్తాపడంది. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జయలక్ష్మి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరి నేపాల్ వెళ్తోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెంగళూర్‌లో పనిచేసే వారు తమ సొంత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు నేపాల్‌కు వెళ్తున్నారు. ఇందులో 80 సీట్లు ఉండగా 150మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బస్సు సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో సొనాల మండలం ఘన్‌పూర్ వద్ద గల సాకెరకు చేరుకుంది. ఇక్కడ ఓ కల్వర్టు వద్ద గుంత ఉండటంతో వాహనం కుదుపునకు గురైంది. వెంటనే పక్కనే ఉన్న చేనులో పడింది. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు అంతా స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో సాకెర గ్రామంలో ఉన్న స్థా నిక ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్‌లను రప్పించారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో వారు ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించారు. వేరే బస్సులో వారిని గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనలో 56 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు.
ఓవర్‌లోడ్, అధిక లగేజే కారణం
కొన్నేళ్లుగా బెంగళూర్ నుంచి నేపాల్ వరకు ప్రైవేట్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో పరిమితికి మంచి ప్రయాణికులను తరలిస్తున్నారు. అలాగే అధికంగా లగేజీ ఉండటంతో ఆర్టీవో చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న డ్రైవర్లు రూటు మార్చుతున్నారు. ఆదిలాబాద్ మీదుగా భోరజ్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లాల్సి ఉండగా.. బోథ్ ఎక్స్ రోడ్డు నుంచి పొచ్చెర క్రాస్ మీదుగా ఘన్‌పూర్ వద్ద మహారాష్ట్రలో ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవర్‌లోడ్ కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా