
రిజర్వేషన్ల కసరత్తు పూర్తి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి జిల్లా యంత్రాంగం రెండు రోజులు గా చేపట్టిన కసరత్తు పూర్తయింది. సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కులాల వారీగా రిజర్వేషన్లను కేటాయించింది. జిల్లాలోని డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలంతా జెడ్పీ సమావేశ మందిరంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు మకాం వేశారు. స్థానాల వారీ గా కులాల వారీ లెక్కలతో కుస్తీ పట్టారు. జనాభా దామాషా, రొటేషన్ విధానంలో అన్ని స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ దగ్గరుండి పర్యవేక్షించగా, జెడ్పీ సీఈవోగా పనిచేసిన జితేందర్‌రెడ్డి, డీపీవో రమేశ్, ఆర్డీవో స్రవంతి ప్రక్రియను నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా ఈ ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లకు ప్రభుత్వం జీవో జారీ చేశాక మహిళ/పురుషుల వారీగా కేటాయిస్తూ వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
వీడని ఉత్కంఠ ..
స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ప్రభుత్వ అధికారిక ప్ర కటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూ సినా తమ మండలం, గ్రామాలకు సంబంధించిన ఆయా స్థానాలు ఎవరికి రిజర్వ్ అవుతాయో అంటూ చర్చించుకోవడం కనిపించింది. పరిచయం ఉన్న అధికారులను సంప్రదిస్తూ ఆరా తీశారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని బయటకు చెప్పే అవకాశం లేకపోవడంతో వివరాలేమి వెల్లడికాలేదు.