బడిబాట పట్టేనా?
● ప్రణాళిక సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ● వచ్చే నెల 6 నుంచి 19 వరకు కార్యక్రమాలు ● సర్కారు బడుల్లో పిల్లల్ని చేర్పించడమే లక్ష్యం ● ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల ప్రచార హోరు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల బలోపేతం కో సం ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలను ఖరారు చేసింది. కొత్తగా చేరే వారితో పాటు బడిబయటి పిల్లల్ని పాఠశాలలో చేర్పించడమే ప్రధాన లక్ష్యం. గతేడాది నెల పాటు నిర్వహించినా ఆశించిన ప్రగతి సాధించలేదు. ప్రైవేట్‌లోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు చేపట్టింది. మెగా డీఎస్సీద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పక్షం పాటు పండగ వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే విద్యార్థులు ఈ ఏడాది ఏ మేరకు సర్కారు బడుల్లో చేరుతారో వేచి చూడాల్సిందే.
బడిబయట పిల్లలు చేరేనా..
ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యాశాఖ పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ డ్రాపౌట్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించినా మళ్లీ చెత్తకుప్పల వెంట, హోటళ్లు, లాడ్జీలు, తదితర పరిశ్రమల్లో పనిచేస్తూనే ఉన్నారు. వారం, పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినా అనుబంధ శాఖలు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 500కు పైగా బడిబయట పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికి పైనే ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు.
లక్ష్యం నెరవేరేనా..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాయి. తల్లిదండ్రులను మ భ్యపెట్టి తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్‌లోనే అడ్మిషన్లు అధికంగా కావడం గమనార్హం. ఈ ఏడాదైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా అని పలువురు చర్చించుకుంటున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి సర్కారు బడిలో చేర్పించేలా చర్యలు చేపడతాం. జూన్ 6 నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నాణ్యమైన విద్య అందుతుంది.
– ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, డీఈవో


