Sakshi News home page

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల మృతి

Published Tue, Sep 19 2023 7:40 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బ్యాంక్‌ ఉద్యోగులు వీకెండ్‌లో సరదాగా గడిపేందుకు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి హిల్‌స్టేషన్‌లోని చిక్కల్‌ధార ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం తెల్లవారుజామున కారులో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

ఉదయం 8 గంటల ప్రాంతంలో 200 అడుగుల లోతులో పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా నలుగురు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. స్నేహితుల మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమరావతి, పరత్వాడ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలకు చిక్కల్‌ధర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, అధికారులు సంఘటన స్థలానికి పయనం అయ్యారు.

మరణంలోనూ వీడని స్నేహబంధం..
భీంపూర్‌ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన షేక్‌ సల్మాన్‌, బొల్లి వైభవ్‌ కొన్నేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన పొలాల అమావాస్య వేడుకల్లో సైతం ఇద్దరు కలిసి బసవన్నలను ఊరేగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలవడం గమనార్హం.

బ్యాంకు ఉద్యోగాలతో స్నేహితులుగా మారి..
వేర్వేరు జిల్లాల్లో పుట్టి పెరిగిన వీరంతా ఉద్యోగరీత్యా ఆదిలాబాద్‌ జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన స్నేహంతో సరదా కోసం చేసిన వీకెండ్‌ ట్రిప్‌ విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని వివిధ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ శాఖల్లో ఉద్యోగం చేస్తున్న యువకులకు ఆర్లి(టి) గ్రామానికి చెందిన షేక్‌ సల్మాన్‌తో స్నేహం ఏర్పడింది.

సల్మాన్‌ సొంతంగా వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కాగా అర్లి(టి), భీంపూర్‌తో పాటు వివిధ బ్యాంక్‌ శాఖలకు అప్పుడప్పుడు జిల్లా బ్యాంకు నుంచి నగదు రవాణా కోసం ఈయన వాహనాన్ని బ్యాంకు ఉద్యోగులు అద్దెకు తీసుకునేవారు. ఈ క్రమంలో ఏర్పడిన స్నేహంతో వీరంతా కలిసి వీకెండ్‌ కోసం వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు.

మృతులు వీరే..
ఆదిలాబాద్‌ జిల్లాలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులతో పాటు అర్లి(టి)కి చెందిన మరో ఇద్దరు మహారాష్ట్రలోని చిక్కల్‌ధర ఆహ్లాదకర ప్రాంతా న్ని సందర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లారు. కారు అదుపు తప్పి చిక్కల్‌ధర లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో భీంపూర్‌ మండలం అర్లి(టి) సర్పంచ్‌ గొల్లి రమ – లస్మన్నల కుమారుడు వైభవ్‌ యాదవ్‌ (28), అదే గ్రామానికి చెందిన షేక్‌చాంద్‌ – రుక్సానా దంపతులకు మారుడు, కారు డ్రైవర్‌ షేక్‌ సల్మాన్‌ (31), నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొర్టికల్‌కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), అదే జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెంకు చెందిన కోటేశ్వర్‌రావు (27) అనే నలుగురు మృత్యు ఒడిలోకి చేరారు.

కాగా ఖమ్మం జిల్లా పొన్నెకల్‌కు చెందిన శ్యామ్‌రాజ్‌, నల్గొండలోని మిర్యాలగూడకు చెందిన యోగేష్‌యాదవ్‌, అదే జిల్లాలోని కేటపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన హరీష్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుమన్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన శివకృష్ణ తాంసి మండలంలోని కప్పర్ల టీజీబీ శాఖలో క్యాషియర్‌గా, కోటేశ్వర్‌రావు భీంపూర్‌ మండల కేంద్రంలోని టీజీబీ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అలాగే అర్లి(టి)కి చెందిన వైభవ్‌ కాటన్‌ కమీషన్‌ ఏజెంట్‌, సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయారు. వారు రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. రాత్రి వరకు కూడా మృతదేహాలు ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో శ్యామ్‌రాజ్‌ రెడ్డి అర్లి(టి)లో క్యాషియర్‌గా, సుమన్‌ జైనథ్‌ మండలం పెండల్‌ వాడలో క్యాషియర్‌గా, యోగేష్‌ యాదవ్‌, హరీష్‌లు బేల మండల కేంద్రంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

వీరు జిల్లాకేంద్రంలో అద్దెకు ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నారు. కష్టపడి కొలువు సాధించి కుటుంబాలకు అండగా ఉంటున్న తరుణంలో అనుకోని రీతిలో ఇద్దరు మృతిచెందడం వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. అలాగే షేక్‌ సల్మాన్‌ వాహనాన్ని కొనుగోలు చేసి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో కుటుంబ దిక్కు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement