కల్యాణ ఘడియలు | Sakshi
Sakshi News home page

కల్యాణ ఘడియలు

Published Mon, May 1 2023 11:38 AM

- - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: శుభముహూర్తాలు వచ్చేశాయి. గురు మూఢం కారణంగా ఏప్రిల్‌ నెలలో పెళ్లిళ్లకు శుభముహుర్తాలు లేవు. ఈనెల 3న బుధవారం నుంచి పెళ్లి భాజాభజంత్రీలు మోగనున్నాయి. జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడనున్నాయి. పెళ్లి మండపాలు ముస్తాబవుతున్నాయి. శుభలేఖల ప్రింటింగ్‌ పనులు పూర్తి కాగా, వంటవారు, భాజాభజంత్రీల వారు, పురోహితులు అంతా సిద్ధమవుతున్నారు.

రద్దీగా దుకాణాలు
ఈనెల 3 నుంచి పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఫంక్షన్‌ హాళ్లు ముందస్తుగా బుక్‌ అయ్యాయి. ఈసారి అధికంగా ముహూర్తాలు ఉండటంతో నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు మొత్తం 25 రంగాల వారికి చేతినిండా ఉపాధి ఉండనుంది. వేద బ్రాహ్మణులు, బ్యాండ్‌ మేళం, సౌండ్‌ సిస్టమ్‌, లైటింగ్‌, డెకరేషన్‌, క్యాటరింగ్‌, వంటలు చేసేవారు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, ఫొటోగ్రాఫర్లు, వ్యాపారులు తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండునెలల్లో మంచి రోజులు
ఏప్రిల్‌లో ముహూర్తాలు లేవు. మే, జూన్‌ నెలలో 23 మంచిరోజుల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. జులైలో మంచి రోజులు లేవు. ఆగస్టు 19 నుంచి మంచి రోజులు ప్రారంభమై డిసెంబర్‌ 31 వరకు ఉన్నాయి.

– పట్వారీ శ్రీనివాస్‌, ఆలయ పూజారి
శుభముహూర్తాలు ఇలా..

ఈనెల 3 నుంచి వరుసగా 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 21, 26, 27, 28, 30, 31, జూన్‌లో 1, 3, 7, 8, 9, 10, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో శుభకార్యాలు జరగనున్నాయి. జూన్‌ 19 నుంచి ఆషాఢమాసం మొదలై, జులై మొత్తం అధిక శ్రావణం కావడంతో ఆగస్టు 18 వరకు ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 19న మంచిరోజులు ప్రారంభమై డిసెంబర్‌ 31 వరకు ఉన్నాయి.

Advertisement
Advertisement