సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్దే
రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించాలి
విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు
ఖమ్మం మామిళ్లగూడెం : దివంగత ముఖ్యమంత్రి 7వ వర్ధంతిని ఈ నెల 2న జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకటేశ్వర రావు, మందడపు వెంకటరామిరెడ్డి, జిల్లేపల్లి సైదులు, ఆలస్యం సుధాకర్ కోరారు. బుధవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ ప«థకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ‘ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇళ్లు, వృద్థులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ ఒకటో తేదీనే ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆయన పాలన స్వర్ణయుగంగా వర్ధిల్లిందని, ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను తొలగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప«థకాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని, గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా వైఎస్ వర్ధంతి సభలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, షేక్ కరీం, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, శ్రీనివాస్, రామకృష్ణ, గాదె వీరారెడ్డి, ఆలూరి రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.