breaking news
Young couple commit suicide
-
విషాదం: రైలు కిందపడి యువదంపతుల ఆత్మహత్య
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్‌కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్‌పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రేమించి, పెళ్లాడి.. ఆత్మహత్య
కర్ణాటక (దొడ్డబళ్లాపురం) : ప్రేమించుకుని పెద్దలను కూడా ఎదిరించి పెళ్లి చేసుకుందో యువ జంట. అయితే ఆర్థిక సమస్యలకు భయపడి భర్త ఆత్మహత్య చేసుకోగా, పతీ వియోగాన్ని తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన రామనగర తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు.. రామనగర తాలూకా తిమ్మసంద్ర గ్రామానికి చెందిన శివరాజు (27) ఆటోడ్రైవర్. పక్క గ్రామం అరళీమరదొడ్డికి చెందిన నవ్య (20)ను ఒకటిన్నర సంవత్సరం క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దంపతులు తిమ్మసంద్రలో నివసించేవారు. శివరాజ్ ఆటో నడుపుతుంటే, నవ్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్లేది. భార్యను డ్యూటీకి వదిలి.. ఆదివారం ఉదయం భార్యను గార్మెట్స్ ఫ్యాక్టరీకి వదిలి ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమైన అప్పుల బాధే ఇందుకు కారణమని తెలిసింది. అంత్యక్రియలు ముగిశాక నవ్యను ఆమె తల్లితండ్రులు ఇంటికి తీసికెళ్లారు. భర్త మరణాన్ని తట్టుకోలేని నవ్య పుట్టింట్లో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రేమ ఫలించదన్న వేదనతో..
యువజంట ఆత్మహత్యాయత్నం యువకుడు మృతి, ఆస్పత్రిలో మృత్యువుతో యువతి పోరాటం సామర్లకోట: పెద్దలు తమ ప్రేమను అంగీకరించనే భయంతో యువజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆ సంఘటనలో యువకుడు మరణించగా యువతి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గామానికి చెందిన కల్వకుంట చంద్రశేఖర్, రత్నకుమారిల రెండో సంతానం అనిత (21). రాజోలుకు చెందిన ఆకుల సుబ్బయ్యమ్మ, వెంకటేశ్వర్లు ఏకైక కుమారుడు మణిదీప్ సురేంద్ర కుమార్ (21). వీరిద్దరూ పెద్దాపురం మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ చదువుతున్నారు. అనిత పెద్దాపురం సుధాకాలనీలోని బీసీ బాలికల హాస్టల్ ఉంటూ ప్రతీ రోజూ కళాశాలకు వెళుతోంది. మణిదీప్ సురేంద్రకుమార్ పిఠాపురంలోని మేనమామ ఇంటి వద్ద ఉంటూ ప్రతీ రోజు కళాశాలకు వెళుతున్నాడు. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని ఇద్దరూ భావించారు. దాంతో సురేంద్రకుమార్ బుధవారం అనితకు ఫోన్ చేసి ‘నేను ఈ లోకానికి దూరంగా పోతున్నాను. నాకు ఎవరితోను సంబంధం లేదు’ అని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇద్దరూ చనిపోవాలని సెల్ ఫోన్‌కు మెసెజ్‌లు పెట్టుకున్నట్టు రైల్వే పోలీసులు చెప్పారు. సామర్లకోట మండలం పీబీ దేవం వద్ద సురేంద్రకుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా అనిత హాస్టల్లో పురుగుల మందు సేవించింది. గురువారం తెల్లవారుజామున వసతి గృహంలో అపస్మారక స్థితిలో ఉన్న అనితను కమాటి సూర్యప్రభ, తోటి విద్యార్థినులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడికల్ వార్డు ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. స్టడీ అవర్ కోసం విద్యార్థులను నిద్ర లేపడానికి వెళ్ళగా అనిత కలవరంగా ఉందని, దానిపై తాను ప్రశ్నించగా పురుగుల మందు తాగానని, డబ్బా బాత్రూమ్లో పడేశానని చెప్పినట్టు కమాటి వివరించింది. అయితే విద్యార్థినులు మాత్రం అనిత అపస్మారక స్థితిలో గ్రౌండ్ ప్లోర్ గేటు వద్ద పడిపోయి ఉందని తెలిపారు. అనిత పురుగులు మందు తాగడంతో పాటు ఉరివేసుకునేందుకు యత్నించింది. మెడపై నల్లగా ఉండడంపై తాము అనిత ను ప్రశ్నించగా చున్నీతో లాగుకున్నట్టు తెలిపిందని విద్యార్థినులు, కమాటి తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అనిత తల్లిదండ్రులు రత్నకుమారి చంద్రశేఖర్ ఆసుపత్రికి చేరుకున్నారు. రైల్వే కీమన్ వీరబాబు సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరారు. సామర్లకోట నుంచి రాజమండ్రి వెళ్లే రైలు కింద కేఎం నెం.616/13-15 మధ్య సురేంద్రకుమార్ మృత దేహం లభించింది. మృత దేహం మాంసం ముద్దగా నుజ్జునుజ్జు అయింది. ట్రాక్ సమీపంలో ఉన్న రైలు సిమెంటు కమ్మిలపై బ్యాగ్ ఉంచి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బ్యాగ్‌లో ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా మృతుని వివరాలు సేకరించారు. అతని తల్లిదండ్రులు సుబ్బయ్యమ్మ, వెంకటేశ్వర్లు, బంధువులు సామర్లకోట పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రేమ విషయం తమకు తెలియదని వారు రోదించారు. మృతదేహానికి పెద్దాపురం ఆస్పత్రిలో పోస్టు మార్టమ్ నిర్వహించి కేసు నమోదు చేసి రైల్వే ఎస్సై ఎ. వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.