breaking news
yalamacali
-
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
బైఠాయించిన 200 మందికి పైగా కూలీలు పనుల నిలిపివేతపై తీవ్ర ఆందోళన యలమంచిలి : ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కూలీలు గురువారం యలమంచిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎర్రవరం నుంచి 22 గ్రూపులకు చెందిన 200 మందికి పైగా కూలీలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 22 వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. యలమంచిలిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం వల్ల వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఉపాధి లేకపోవడంతో అప్పుల పాలవుతున్నామన్నారు. అధికారులు, నేతలు స్పందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి వచ్చేవరకు కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల పనులను నిలిపివేశారని చెప్పారు. సమస్యను పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
సీన్ మారింది
నిన్న అనకాపల్లి.. నేడు యలమంచిలి‘దేశం’లో రచ్చ రచ్చ పంచకర్లకు టికెట్ కేటాయించారనే సమాచారంతో తమ్ముళ్ల శివాలు టీడీపీ అధిష్టానంపై ఆగ్రహావేశాలు పార్టీ కార్యాలయంలో విధ్వంసం ఫర్నిచర్‌కు నిప్పు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా తెలుగుదేశంలో పరిస్థితి బాగోలేదు. తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీలో ఎటువంటి పాత్ర పోషించని పీలా గోవింద్‌కు సీటు ఖరారైందన్న వార్తతో కోర్ కమిటీ పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి వీరంగం సృష్టించారు. ఇది మరిచిపోకముందే యలమంచిలి నియోజవర్గ టీడీపీ టికెట్ వ్యవహారం వివాదాస్పదంగా మారి రచ్చరచ్చయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పట్టణంలోని తెలుగుతమ్ముళ్లు శివాలెత్తిపోయారు. పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను పంచకర్ల రమేష్‌బాబుకు అధిష్టానం కేటాయించిందన్న సమాచారంతో సుందరపు విజయ్‌కుమార్ అనుచరులు రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రోడ్డెక్కారు. యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు యలమంచిలి చేరుకుని తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్ ఇంటినుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి పీవీ కాంప్లెక్స్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోపలి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. విజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు. కొందరు కిరోసిన్‌తో ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని తోటి కార్యకర్తలు నివారించారు. రెండేళ్లుగా పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్‌ను కాదని స్థానికేతరుడైన పంచకర్ల రమేష్‌బాబుకు టికెట్ కేటాయించడం అన్యాయమని ఆపార్టీ నాయకులు బొద్దపు శ్రీను, గొర్రెల నానాజీ, కాండ్రకోట చిరంజీవి, లవుడు లోవరాజు, రంగనాయకులు తదితరులు తెలిపారు. ప్రాదేశిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారన్నారు. నియోజకవర్గంలో దాదాపు 36 గ్రామపంచాయితీల్లో టీడీపీ విజయానికి కృషిచేశారన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారిని కాదని స్థానికేతరులకు సీటు కేటాయించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రంలోగా విజయ్‌కుమార్‌కు టీడీపీ బి-ఫారం ఇవ్వకపోతే తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మండల తెలుగుదేశంలో నిస్తేజం మునగపాక: మండల తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అలముకుంది. నిన్నటి దాకా పార్టీని నడిపించి.. జెండాలు భుజాన మోసిన వారిని కాదని వలస నాయకులకు అధిష్టానం టికెట్ కేటాయిస్తున్నదన్న ప్రచారంంతో తెలుగుతమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. మునగపాక మండలంలో పార్టీకి జవసత్వాలు కల్పించిన నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయకుమార్‌కు యలమంచిలి సీటు కేటాయించే పరిస్థితులు లేవని తెలుసుకున్న వారంతా లోలోన మథనపడుతున్నారు. కొత్తవారికి సీటు కేటాయిస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో యువకులు సుందరపుకు సీటు రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామంటూ బాహాటంగానే చెబుతున్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పలువురు పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేయడం విశేషం. చంద్రబాబు పొరపాట్లు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘న్యూస్‌లైన్’వద్ద వాపోయారు.