breaking news
Yalala police
-
అర్ధరాత్రి హోంగార్డు సాహసం
రంగారెడ్డి/యాలాల(తాండూరు): అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్‌ను తస్కరించే ముఠాకు యాలాల పీఎస్‌కు చెందిన ఓ హోంగార్డు చెమటలు పట్టించాడు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాను ఒక్కడే ధైర్యంగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడటంతో దుండగులు తాము ప్రయాణిస్తున్న కారును వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాలాల ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న భీంరెడ్డి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని తాండూరులో వదిలేసి తిరిగి యాలాల ఠాణాకు వాహనంలో ఒంటరిగా వెళుతున్నాడు. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిలిపి ఉంచిన లారీల పక్కన ఓ తెల్లటి కారు (ఏపీ 28 ఏటీ 2889) అనుమానాస్పదంగా ఉండటం గమనించాడు. కారు దగ్గరకు వెళ్లి పరిశీలించగా నిలిపి ఉంచిన లారీ నుంచి డీజిల్‌ను తస్కరిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే తేరుకుని భీంరెడ్డి వారిని పట్టుకునేందుకు యత్నించాడు. భీంరెడ్డి రాకను గమనించిన ముఠా.. కారును కొడంగల్ మార్గంలో ముందుకు పోనిచ్చారు. భీంరెడ్డి పోలీసు వాహనంలోనే దుండగుల కారును వెంబడించాడు. ఇలా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడగా, దౌలాపూర్–తిమ్మాయిపల్లి మార్గంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద దుండగులు కారును వదిలేసి చెరో వైపు పరారయ్యారు. ఘటన స్థలంలో నిలిపి ఉంచిన కారు టైర్లలోంచి గాలిని తీసేసిన భీంరెడ్డి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే పలు లారీల నుంచి తస్కరించిన దాదాపు 250 లీటర్ల డీజిల్ డబ్బాలను కారులోంచి స్వాధీనం చేసుకున్నారు. కారును యాలాల ఠాణాకు తరలించారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా హోంగార్డు చేసిన సాహసంపై తోటి ఉద్యోగులు, మండలవాసులు అభినందిస్తున్నారు. -
నిప్పంటించి.. కళ్లలో కారం చల్లి..
యాలాల: నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా మంటలకు తాళలేక కేకలు పెడుతున్న అతడి కళ్లలో కారం చల్లి మరీ తన కర్కశాన్ని ప్రదర్శించిందో భార్య. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ఉద్దెరి రాములు(50) అక్కం పల్లికి చెందిన సావిత్రమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వీరికి వెంకటయ్య, ఆంజనేయులు, విజయలక్ష్మి, రాధ, వెంకటలక్ష్మి సంతానం. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు పొలం పని చేసి రాములు ఇంటికొచ్చాడు. అయితే, కుమారుడు ఆంజ నేయులు కనపడడంతో ఖాళీగా కూర్చొనే బదులు పశువులను పాకలో కట్టేయవచ్చు కదా అంటూ అతడిపై మండి పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన సావిత్రమ్మ.. భర్తతో గొడవకు దిగింది. ఇరుగుపొరుగువారు కల్పిం చుకుని ఇద్దరినీ సముదాయించారు. రాత్రి ఏమీ తినకుం డానే ఇంటిముందు ఉన్న కట్టపై రాములు నిద్రకు ఉపక్రమించాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో కట్టపై నిద్రిస్తున్న రాములుపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక కేకలు వేస్తున్న భర్త కళ్లలో కారం చల్లడంతో అటు మంటల బాధ, ఇటు కారం మంటతో రాములు ఇంటి బయట ఉన్న మురుగు కాల్వలోకి తలను దూర్చిస్పృహ కోల్పోయాడు. రాములు కేకలు విన్న ఇరుగుపొరుగు అతడిని ఆటోలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలిం చారు. సావిత్రమ్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చిన్న కొడుకు ఆంజనేయులతో కలసి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విషయం తెలిసిన వెంటనే రూరల్ సీఐ సైదిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ, ఎస్ఐ అరుణ్‌కుమార్ తాండూరు ఆస్పత్రికి చేరుకుని రాములు నుంచి వాంగ్మూలం సేకరించారు. తన మృతికి సావిత్రే కారణమని రాములు పేర్కొన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాములు తెల్లవారుజామున చనిపోయాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని యాలాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.