breaking news
Y Srinivasa Rao
-
ఈ అవమానాలు అవసరమా!?
చంద్రబాబు ఇలాకాలో అమాత్యులకు అవమానాల పరంపర కొనసాగుతూనే వుంది. అవమానాలకు గురవుతున్న అమాత్యులు లోలోన నలుగుతున్నారే తప్ప తమకూ ఒక వ్యక్తిత్వం ఉందనే విషయం మరిచిపోయినట్లున్నారు. కాదు చంద్రబాబు మరచిపోయేలా చేసినట్లున్నారు. నాలుగు గోడల మధ్య కాదు ఏకంగా నలుగురిలో జరిగే కార్యక్రమంలోనూ అమాత్యులకు అవమానాలు తప్పడంలేదు. సొంత శాఖల కార్యక్రమాలకే పాపం అమాత్యులకు దిక్కులేదు. ఇక్కడ బాబు అవమానిస్తున్నది అమాత్యులను కాదు, వారి వెనుక ఉన్న కులాన్ని. ఈ అసలు విషయం మరిచిపోయి తలదించుకుని ఎందుకు అమాత్య పదవులను పట్టుకుని వేళ్ళాడుతున్నారో వారి అంతరాత్మకే తెలియాలి. మిగిలిన మంత్రులను పక్కనబెడితే కీలకమైన శాఖలతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ.కృష్ణమూర్తి అధినేత చేస్తున్న అవమానాలను మౌనంగా భరిస్తూనే ఉన్నారు. తాజాగా రాజధానిలో టీటీడీ నిర్మించనున్న కలియుగ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కె.ఇ. కృష్ణమూర్తికి ఓ సాధారణ టీటీడీ అధికారి నుంచి ఆహ్వానం అందింది. ఇంతకంటే దారుణమైన అవమానం గతేడాది హోంశాఖను వెలగబెడుతున్న మరొక ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు ఎదురైంది. ఎ.పి.ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఏకంగా ఒక కానిస్టేబుల్ ద్వారా ఆహ్వానపత్రికను పంపించి అవమానిం చారు. ఈ రెండు కార్యక్రమాల్లో ముఖ్యఅతిథి, శంఖుస్థాపన చేసింది సాక్షాత్తు సీఎం. కాకపోతే చినరాజప్ప ఎందుకు రాలేదో అడిగిన సీఎం తాజాగా కె.ఇ. కృష్ణమూర్తి ఎందుకు రాలేదని కూడా అడగలేదని సమాచారం. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా, దళితులు సరైన దుస్తులు వేసుకోరు, శుభ్రంగా ఉండరు, గిరిజనులు ఎక్కడో అడవుల్లో ఉంటారు, చదువురాదు, తెలివిలేదంటూ... ఇంకా ఇంకా అనేకానేక అవమానకరమైన మాటలు సాక్షాత్తు సీఎం బహిరంగసభల్లోనే మాట్లాడినా దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులకు పౌరుషంలేకుండానే కేబినెట్లో కొనసాగుతున్నారు. ఇది తప్పు, మమ్మల్ని అవమానిస్తున్నారు అని కనీసం అంతర్గతంగానైనా ప్రశ్నించిన దాఖలాల్లేవు. ప్రస్తుత పాలనలో పాలక సామాజికవర్గం చేతుల్లో మిగిలిన అన్ని కులాలు ఎంతగా అవమానాలకు గురవుతున్నాయో ఈ నాలుగేళ్ళ పాలనలో అనేకానేక దాఖలాలు, సంఘటనలు కోకొల్లలు. తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని అవమానాలను ఎందుకు మౌనంగా భరిస్తున్నారో అర్థంకాని విషయం. తాము ఫలానా కులం తరపున కేబినెట్లో స్థానం పొందాము, తమకు అవమానం జరిగితే అది మొత్తం తమ కులానికి జరిగినట్లేనని అమాత్యులు భావించకపోవడం బానిస జీవితానికి అద్దంపడుతోంది. సమాజంలో తాము చులకనవుతున్నామనే ఆలోచన కూడా వారికి రాకపోవడం విచారకరం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఫలానా కులం వారు ఫలానా పార్టీలోనే ఉండాలని మన రాజ్యాం గంలో రాసుకోలేదు. కాకపోతే పాలక సామాజిక వర్గం మొత్తం పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మిగిలిన అన్ని కులాలను బానిసలుగా చేసుకుని పాలన చేయడం ప్రజాస్వామ్యం అని పించుకోదు. ఇప్పటికైనా అవమానాలకు గురవుతున్న అమాత్యులు, ఇతర నేతలూ ఒక్కసారి మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకోండి. మీ అంతరాత్మను మీకు మీరే ప్రశ్నించుకోండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారే నిజమైన నాయకులవుతారు. ప్రజల పక్షాన నిలబడిన వారవుతారు. సామాన్యులకు జరిగే అవమానాలు, అసమానతలను తొలగించేందుకు నాయకత్వం వహించగలుగుతారు. ఆలోచిం చుకోండి. సరైన సమయం ఆసన్నమైంది. వై.శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ‘ 87902 30395 -
కార్మికులను వేదిస్తే ఉద్యమిస్తాం
విజయనగరం : ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం విజయనగరం జిల్లా సాలూరులో ఎన్ఎంయూ ఏర్పాటు చేసిన సమావేశంలో వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులు చేసిన చిన్న తప్పులను కూడా యాజమాన్యం పెద్దదిగా చూస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్మికులను వేధిస్తే ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించారు. -
ఆ ఎస్సై తప్పేం లేదు : ఐజీ
ఒంగోలు టౌన్ : గిద్దలూరులో వైఎస్సార్ సీపీ నేత వైజా భాస్కర్‌రెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన ఎస్సై వై.శ్రీనివాసరావును గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ వెనకేసుకొచ్చారు. ఆ ఘటనలో ఎస్సై ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పుకొచ్చారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌తో కలిసి ఐజీ సునీల్‌కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గిద్దలూరు ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడారు. గిద్దలూరులో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు కారణమైన ఎస్సైని వెనకేసుకురావటంలో ఐజీ ఏ మాత్రం సంకోచించలేదు. మహిళా సిబ్బంది లేకుండా డాక్టర్ భార్యను ఎస్సై తన జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని ఐజీ కనీసం ప్రస్తావించలేదు. వైజా భాస్కర్‌రెడ్డి అనారోగ్యం వల్లే మృతి చెందాడని, ఆయన్ను ఎస్సై కొట్టలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, శాంతిభద్రతలను ఉల్లంఘించటం సరైన పద్ధతి కాదన్నారు. భాస్కర్‌రెడ్డి మృతిపై పోస్టుమార్టం నివేదిక తెప్పించామని, మృతుడి శరీరంపై కనపడే దెబ్బలు లేవని నివేదికలో ఉన్నట్లు ప్రస్తావించారు. భాస్కర్‌రెడ్డి మృతి తర్వాత దుండగులు కొందరు గిద్దలూరు-కలశపాడు రోడ్డులో పోలీస్ జీపును తగులబెట్టారని, ఎంవీ సుబ్బారావు హీరోహోండా షోరూం వద్దకు వెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారని చెప్పారు. డాక్టర్ హరనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై.శ్రీనివాసరావు మీద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నెల్లూరు రూరల్ డీఎస్పీని విచారణాధికారిగా నియమించామన్నారు. అన్ని కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ వివరించారు.