breaking news
Writer Kona Venkat
-
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
కొత్త కాంబినేషన్‌తో...
రచయిత కోన వెంకట్ సారథ్యంలో ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కలసి ఒక తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ నిజమే నని తెలిసేలా కోన వెంకట్ తాజాగా ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని (తెలుగు వెర్షన్‌ను) ఎం.వి.వి. సినిమా పతాకంపై అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ‘నాన్న’ లాంటి చిత్రాల ద్వారా సుపరిచితుడూ, హీరోయిన్ అమలా పాల్ భర్త అయిన ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు. ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన ‘బ్లూ సర్కిల్ కార్పొరేషన్’తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా’’ అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు. హార్రర్ నేపథ్యంలో కథ నడుస్తుందని భోగట్టా. సప్తగిరి కూడా ఇందులో ఒక పాత్రధారి. వీటన్నిటికీ తగ్గట్లే కోన కూడా, ‘‘మీకు గనక ‘గీతాంజలి’ సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. కథాంశం మాటెలా ఉన్నా, చాలా రోజుల తరువాత ప్రభుదేవా మళ్ళీ నటించడం, తమన్నా, సోనూసూద్ తదితరులు సహనటులు కావడం లాంటివి ఆసక్తికరమే. టైటిల్‌తో సహా ఇతర విశేషాలు తెలుసుకోవడానికి లెటజ్ వెయిట్! -
స్పెల్ బౌండ్ అయ్యా!
- నిఖిల్ ‘‘నా కెరీర్లో ‘ఢీ’ చిత్రం ఒక మైల్ స్టోన్. ఆ సినిమా విడుదలై పదేళ్లయ్యింది. ఆ చిత్రం తర్వాత ‘శంకరాభరణం’ మరో కొత్త అధ్యాయానికి తెర తీసే చిత్రం అవుతుంది. హిందీ చిత్రాల స్థాయిలో తెలుగు చిత్రాలు ఉంటాయా? అనేవారికి ‘శంకరాభరణం’ మంచి సమాధానం అవుతుంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ఈ చిత్రానికి కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ - ‘‘హిందీ చిత్రం ‘ఫస్ గయా రే ఒబామా’ చూసి, ఒక ఐడియా తీసుకుని దాని చుట్టూ కథ అల్లాను. ఈ చిత్రనేపథ్యం, స్క్రీన్‌ప్లే, టోటల్‌గా స్క్రిప్టే ఓ సవాల్ . గౌతమ్ పాత్రను నిఖిల్ అద్భుతంగా చేశాడు’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వె ర్సస్ సూర్య’ తర్వాత నేనో డిఫరెంట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్న టైంలో కోన వెంకట్‌గారి నుంచి ఫోన్ వచ్చింది. బాలకృష్ణగారు, రామ్‌చరణ్ లాంటి పెద్ద హీరోలతో వర్క్ చేసే స్థాయి ఆయనది. ఆయన ‘శంకరాభరణం’ కథ చెప్పినప్పుడు స్పెల్ బౌండ్ అయ్యా’’ అని చెప్పారు. ‘‘పాటలకు మంచి స్పందన లభించింది. ఆదివారం వైజాగ్‌లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరపనున్నాం’’ అని చిత్ర సంగీతదర్శకుడు ప్రవీణ్ లక్కరాజు అన్నారు. ఉదయ్ నందనవనమ్, నందిత, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.