breaking news
womens Saving movement
-
ఊరూరా మహిళా దుకాణాలు
సాక్షి, రఘునాథపల్లి: మహిళలు స్వశక్తితో ఎదిగేలా బ్యాంకు రుణాలందించడంతో పాటు, స్వయం ఉపాధి పొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయించి వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల చొరవతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 204 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలివిడతగా 60 స్టోర్లు ఏర్పాటు చేశారు. స్టోర్ల ఏర్పాటు, అమ్మకాలు, శిక్షణలో బైరిసన్స్ సంస్థ సహకారం అందిస్తుండటంతో స్టోర్లకు బైరిసన్స్ ఎస్‌హెచ్‌జీ స్టోర్లుగా నామకరణం చేశారు. నిత్యావసర వస్తువులు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు అందించడమే స్టోర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టోర్లలో సామగ్రి కొనుగోళ్లు, తయారీ, రవాణా, విక్రయం అంతా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే జరగనుంది. 140 రకాల నిత్యావసర వస్తువులు సాధారణ కుటుంబాలకు నిత్యం ఎన్ని సరుకులు అవసరమన్న అంశంపై సెర్ప్ సిబ్బంది, బైరిసన్స్ ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఒక్కో కుటుంబానికి 262 వస్తువులు అవసరమని, ఇందులో 140 అత్యంత అవసరమని గుర్తించారు. వీటితో పాటు ఇతర వస్తువుల క్రయవిక్రయాలపై పొదుపు సంఘాల సభ్యులకు జిల్లా సమాఖ్య ద్వారా శిక్షణ ఇచ్చారు. ఒక్కో మండలంలో 15 నుంచి 20 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో నిత్యం కావాల్సిన పప్పు, ఉప్పు, చక్కెర, బియ్యం, సబ్బులు తదితర సరుకులు విక్రయించనున్నారు. జూట్ సంచుల తయారీ, శారీ డిజైనింగ్, ప్రింటింగ్, సర్ఫ్, ఫినాయిల్, జండుబామ్, హార్ఫిక్, దూప్‌స్టిక్స్, తయారీపై వరంగల్‌కు చెందిన జనశిక్షణ సంస్థాన్ సంస్థ తరఫున శిక్షణ ఇస్తుండగా, వీటిని తయారుచేసి స్టోర్లలో బైరిసన్స్ అగ్రో ఇండియా ఉత్పత్తులతో కలిపి విక్రయించనున్నారు. శిక్షణ పొందిన మహిళలకు రుణాలు శిక్షణ పొందిన మహిళలు వస్తువులు తయారు చేసేందుకు బ్యాంకు, స్త్రీనిధి, సెర్ప్ ద్వారా రుణాలు అందించనున్నారు. ఇంటి వద్ద తయారు చేసిన ప్రతీ వస్తువును డీఆర్డీఓ ఆధ్వర్యాన ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌కు తరలిస్తారు. జిల్లావ్యాప్తంగా ఒకే ధరతో ఓపీఎస్ మిషన్ ద్వారా వినియోగదారులకు కంప్యూటర్ బిల్లులు అందిస్తారు. మార్కెట్ కంటే తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు స్టోర్లలో లభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల ఆర్దికాభివృద్ధికి దోహదం మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే స్టోర్ల ఏర్పాటు లక్ష్యం. తయారీ నుంచి విక్రయం వరకు అంతా చైన్ సిస్టం ద్వారా జరుగుతుంది. రఘునాథపల్లి మండలంలో 24 గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తయారు చేసిన 15 రకాల ఉత్తత్తులను జిల్లావ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ స్టోర్లకు తరలించి అమ్మకాలు సాగేలా చూస్తాం. తద్వారా 100 మందికి పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. తయారీదారులతోపాటు విక్రయించే వారికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. – సారయ్య, ఏపీఎం, రఘునాథపల్లి ఇళ్ల నుంచే వస్తువులు తీసుకెళ్తాం డీఆర్డీఏ, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తాం. వస్తువుల తయారీ, రామెటిరీయల్ ఎక్కడి నుంచి పొందాలన్న దానిపై అవగాహన కల్పిస్తాం. ఇళ్లకు వెళ్లి వస్తువులు సేకరించనుండటంతో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేయనున్నాం. కలెక్టర్ నిఖిల మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మహిళలతోపాటు వినియోగదారులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. – గూడూరు రాంరెడ్డి, డీఆర్డీఓ, జనగామ జిల్లా -
మహిళల మెడపై కత్తి
- టీడీపీ మాఫీ హామీతో 3 నెలలుగా ఆగిపోయిన చెల్లింపులు - వడ్డీతో అప్పు తీర్చాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి - వచ్చే వారం నుంచి నోటీసులు జారీకి సమాయత్తం విశాఖ రూరల్: చంద్రబాబు తప్పుడు హామీతో మహిళల పొదుపు ఉద్యమానికి ఆటంకం ఏర్పడింది. డ్వాక్రా రుణ మాఫీ ప్రకటన.. మహిళలను బ్యాంకులకు రుణగ్రస్తులను చేసింది. నిన్నమొన్నటి వరకు ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయాన్ని ఆర్జించి పొదుపు చేసుకున్న డబ్బు.. ఇప్పుడు హారతి కర్పూరంలా బ్యాంకు వడ్డీ కింద కరిగిపోనుంది. తీసుకున్న రుణాలు వడ్డీతో సహా వసూలుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. కొంత మంది ఖాతాల్లోని పొదుపు మొత్తం నుంచి అసలు, వడ్డీని జమ చేసుకుంటుండగా.. మిగిలిన వారికి నోటీసులు జారీకి సమాయత్తమవుతున్నారు. రూ.853 కోట్లు బకాయిలు దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకంతో మహిళలు ఆర్థిక ఇ బ్బందులను అధిగమించా రు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. వృత్తి పనులు, వ్యాపారాలు చేస్తూ నెల నెలా పొదుపు చేసుకుంటూ.. ఆర్థిక ఆసరా పొందారు. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అది నమ్మి మహిళా సంఘాలు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశాయి. జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. విశాఖ నగరం పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. సిద్ధమవుతున్న నోటీసులు : డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రుణాలు రద్దవుతాయని భావించి మహిళలు మూడు నెలలుగా చెల్లింపులు ఆపేశారు. తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలంటూ మహిళలపై ఒత్తిడి పెంచేందుకు బ్యాం కర్లు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారం నుంచి జారీకి సమాయత్తమవుతున్నారు. అప్పులు కట్టకపోవడంతో బ్యాంకులు గ్రూపుల ఖాతాలో ఉండే పొదుపు డబ్బును తమ ఖాతాలోకి జమ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది రుణ లక్ష్యం మందగించే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు డ్వాక్రా రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు ఇప్పటి వరకు కేవలం కొన్ని సంఘాలకు రూ.22 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ పరిస్థితితో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు.. నాది అచ్యుతాపురం. చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ హామీతో 8నెలలుగా వాయిదాలు కట్టడం మానేశాను. బ్యాంకు వారు వడ్డీకి వడ్డీతో అప్పును అసలుకు రెట్టింపు చేశారు. లీడర్లుకు చెప్పకుండా పొదుపుసొమ్మును ఒక్కో గ్రూపు నుంచి రూ. 50వేలు నుంచి రూ.లక్ష వరకు జమచేసుకున్నారు. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి..ఇప్పుడు సీఎం మాటమారిస్తే ఊరుకునేదిలేదు. - ఎస్ శాంతి, అచ్యుతాపురం ప్రభుత్వం చేతులెత్తేస్తే ఊరుకోం నాది అచ్యుతాపురం మండలం చోడపల్లి. డ్వాక్రా రుణం చెల్లించాలంటూ బ్యాంకు మేనేజర్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రాక్రా అప్పుఉన్న మ హిళ కుటుంబసభ్యుల పేరుమీద బ్యాంకుల్లో బం గారం తాకట్టు ఉంటే విడిపించుకోకుండా అడ్డుకుంటున్నారు. సభ్యురాలి రుణానికి కుటుంబసభ్యులకు సంబంధం ఏమిటో అర్థం కావడంలేదు. మాఫీ చేస్తామని ఓట్లు దండుకొని చేతులెత్తేస్తే ఊరుకోం. - అనసూరి లక్ష్మి, చోడపల్లి