ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ప్రయాణం
సాక్షి నెట్వర్క : పలు పథకాల కింద ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ వివిధ రాయితీలు అందిస్తోంది. ఎక్కువమంది ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించడం, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంలో భాగంగా ఈ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో కొన్ని..
వారం రోజుల ప్రయాణానికి ‘విహారి’
రూ.550తో ‘విహారి’ టిక్కెట్ తీసుకున్నవారు వారం రోజులపాటు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీపై రాష్ట్రాన్ని చుట్టి రావొచ్చు. ఏసీ బస్సులు ఎక్కే వీలుండదు.
వనిత ఫ్యామిలీ కార్డు
రెండేళ్లపాటు మనుగడలో ఉండేవిధంగా వనిత ఫ్యామిలీ కార్డును ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఎవరైనా ఈ కార్డును రూ.100 చెల్లించి పొందవచ్చు. కుటుంబం మొత్తం కానీ, ఒక్కొక్కరుగా కానీ ఈ కార్డుపై బస్సులో ప్రయాణించినప్పుడు టిక్కెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. అయితే ఈ కార్డుపై రారుుతీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులకే పరిమితం. ఈ కార్డు పొందడానికి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీతో ఆయా ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలి. ఈ కార్డు ఉన్నవారికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం ఉంది.
నవ్య క్యాట్ కార్డ్ (ఫ్రెష్)
నవ్య క్యాట్ కార్డు (ఫ్రెష్) పేరుతో ఏడాది చెల్లుబాటులో ఉండే విధంగా ఆర్టీసీ కొత్త కార్డును ప్రవేశపెట్టింది. రూ.250 చెల్లించి ఈ కార్డు పొందవచ్చు. ఏసీవి మినహా మిగిలిన బస్సుల్లో టికెట్‌పై 10 శాతం రాయితీ ఇస్తారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులున్న ఒకే కుటుంబంలోనివారికి మొదటి వ్యక్తి మినహా మిగిలినవారు రూ.100 చెల్లిస్తే నవ్య క్యాట్ యాడ్ ఆన్ కార్డు (ఫ్రెష్) ఇస్తారు. ఈ కార్డు తీసుకున్నవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, అదే కుటుంబంలో రూ.100 చొప్పున చెల్లించి (యాడ్ ఆన్ కార్డు) తీసుకున్నవారికి రూ.1.75 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
నవ్య క్యాట్ కార్డ్ (రెన్యువల్)
నవ్య క్యాట్ కార్డు (ఫ్రెష్) గడువు ముగిసిన తర్వాత రెండో ఏడాది తీసుకునేది నవ్య క్యాట్ కార్డు (రెన్యువల్). రూ.150 చెల్లిస్తే ఇది ఏడాది చెల్లుబాటులో ఉంటుంది. మిగిలిన నిబంధనలు ఫ్రెష్ కార్డుకు వర్తించేవే కొనసాగుతాయి. అయితే రూ.1.75 లక్షలు మాత్రమే ప్రమాద బీమా ఉంటుంది.
వికలాంగులకు 50 శాతం రాయితీ
ఈ కార్డు తీసుకున్న వికలాంగులు 50 శాతం రాయితీతో సూపర్ లగ్జరీ, ఏసీవి మినహా మిగిలిన బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆధార్ కార్డ్, అంగవైకల్య శాతం తెలిపే డాక్టర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఈ కార్డు పొందవచ్చు. ఇది ఏడాదిపాటు మనుగడలో ఉంటుంది. ఈ కార్డు కోసం రూ.20 చెల్లించాలి. అంధులు, చెవిటి, మూగవంటివాటితో బాధపడేవారికి కూడా రాయితీ కార్డులు జారీ చేస్తున్నారు.