ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం
కడప అర్బన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రజా రవాణా మనుగడకు ఏకైక మార్గమని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేయకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం లేదన్నారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజల అవసరాల కోసం నడుస్తున్న సంస్థ అని, లాభనష్టాలతో యాజమాన్యం మొదటి నుంచి బేరీజు వేయడం తప్పుడు ఆలోచన విధానమన్నారు. ప్రజా రవాణా అవసరాలను గమనించి అందుకు అనుగుణంగా సంస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 4 వర్క్‌షాపుల్లో ఈయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించామన్నారు. బుధవారం కూడా ఈ ధర్నాలు కొనసాగుతాయన్నారు. యాజమాన్యం అద్దె బస్సులను పెంచడం వల్ల సంస్థకు మరింత భారమవుతుందన్నారు. అద్దె బస్సులను పెంచడమే కాకుండా ఆ బస్సులకు ఆర్టీసీ కండక్టర్లను నియమించకుండా ప్రైవేటు డ్రైవర్లకే డబ్బులు వసూలు చేసే బాధ్యత అప్పగించడం యాజమాన్య వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు. ప్రయాణికులు లేరనే సాకుతో యాజమాన్యం ట్రిప్పులను తగ్గించడం ద్వారా ప్రైవేటు బస్సులు, లారీలు, ఆటోల అక్రమ రవాణాను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. అక్రమ రవాణాను నియంత్రించడం ద్వారానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు. యాజమాన్యం అద్దె బస్సులు, సింగిల్ క్రూ డ్యూటీలు, గ్రౌండ్ బుకింగ్స్, వన్‌మ్యాన్ సర్వీసుల వంటి తప్పుడు విధానాలను మానుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు యాజమాన్యం కూడా గట్టిగా కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.