breaking news
wather department
-
రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: పశ్చి మ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు హెచ్చరించింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. -
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం : నైరుతి రుణపవనాల రాకతో బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ శనివారం ప్రకటనలో తెలిపింది. కోస్తా తీరంవెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదని వెల్లడించారు. -
‘నై’రుతి!
‘విత్తు’ అదను దాటుతోంది. చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని 38 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. మిగిలిన మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే పత్తి, పెసర, మినుము పంటల దిగుబడికి వాతావరణం అనుకూలించదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి స్థానంలో జొన్నలు, మొక్కజొన్నలు, సోయా చిక్కుడు విత్తనాలు వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో వ్యవసాయ పనులు జిల్లాలో ముమ్మరం కావాలి. కానీ ఇంతవరకు రుతువు జాడే లేదు. రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని.. రెండు రోజుల్లో తెలంగాణకు తాకుతాయంటూ వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోతోంది. ఓవైపు ఆకాశం మేఘావృతం అవుతున్నా ఎండ వేడిమి మాత్రం జిల్లాలో తగ్గడం లేదు. దీంతో జిల్లాలో దాదాపుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి పవనాలకంటే ముందే రైతులు దుక్కులను సిద్ధం చేసి పెట్టుకునేవారు. కానీ వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. వర్షాలు సకాలంలో కురిసినట్టయితే జిల్లాలో ఇప్పటికే సగం వరకు సాగు విస్తీర్ణంలో పత్తి సాగయ్యేది. ముందస్తుగా పలకరిస్తాయనుకున్న రుతుపవనాల వెనుకడుగుతో కాలం అవుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం జిల్లాలో ఈ నెలలో సగటు సాధారణ వర్ష పాతం 71.2 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు పడింది కేవలం 29.7 మి.మీ.మాత్రమే. దీంతో జిల్లాలో అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 7 మండలాల్లోనూ సాధారణ వర్షం పాతం కన్నా తక్కువగా వర్షపాతమే నమోదైంది. ఈ వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు జిల్లా అంతటా విస్తరిస్తేనే పంటలకు భవిష్యత్తు ఉంటుంది. జిల్లాలో 64 లక్షల హెక్టార్లను సాగుకు సిద్ధం చేసి ఉంచారు. దీనిలో 1.30 లక్షల హెక్టార్లలో వరి, 1.41 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలతో పాటు మరో లక్ష ఎకరాలలో పప్పు ధాన్యాలు విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం వర్షాలు కురిస్తే.. ఇప్పటికే తొలకరితో నేల తడిసిపోయి.. మలివర్షంతో నీళ్లు చెరువుల్లోకి పారాల్సి ఉంది. జూన్ మాసం మొదటి, రెండో వారాలు విత్తనాలు విత్తటానికి అత్యంత అనుకూలం. కానీ మూడో వారం దాటిపోతున్నా వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎండుతున్న నీటి వనరులు.. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో చిన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో గిరి పుత్రులు మంచినీటి కోసం మైళ్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పశువులకు కూడా తాగడానికి నీళ్లు దొరికేది కష్టమే. ఇప్పటికే గొర్రెలకు మేత దొరకక గొర్రెల కాపర్లు వలస బాట పట్టారు. నైరుతి రుతు పవనాలు వెనుకడుగు వేస్తే ఈసారి రైతుల జీవన చిత్రం మారక తప్పదేమో.