తడారి.. ఎడారి
సాక్షి,హైదరాబాద్: కృష్ణమ్మ మళ్లీ తడారిపోయింది. చుక్క నీటి ప్రవాహం లేక ఎడారిని తలపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నింటికీ ఎగువ ప్రాంతాల నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. వర్షాకాలం ముగియకముందే వేసవి తరహా గడ్డు పరిస్థితులు నెలకొంటున్నాయి. జలాశయాల్లో ఉన్న కొద్ది నిల్వలూ వేగంగా అడుగంటిపోతుండడం తీవ్ర ఆందోళనకరంగా మారింది.⇒ కృష్ణమ్మ జన్మస్థానమైన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు 518 కి.మీ.ల నిడివిలోని సువిశాల పరీవాహక ప్రాంతం నుంచి ఆల్మట్టి జలాశయానికి గత కొన్ని రోజులుగా చుక్కనీరు రావడం లేదు. ఆల్మట్టి గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 116.53 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి ద్వారా 12,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తోంది. నారాయణపూర్ జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 33.31 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు నుంచి కాల్వలకు 12,598 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో జలాశయంలో నిల్వలు 27.52 టీఎంసీలకు తగ్గిపోయాయి. ⇒ కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయినీ జలాశయానికి సైతం ఎగువ నుంచి చుక్క వరద రావడం లేదు. జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 117.24 టీఎంసీలు కాగా 115.35 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ కాల్వలు, ఇతర అవసరాలకు 4,348 క్యూసెక్కుల నీటిని అక్కడి ప్రభుత్వం వాడుకుంటోంది. ⇒ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం జీరో ఇన్‌ఫ్లో ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఫ్లడ్ బులెటిన్‌లో వెల్లడించింది. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.79 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి వరద లేకపోవడంతో జూరాల కింద ఆయకట్టుకు కేవలం 371 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు.⇒ కృష్ణా మరో ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికీ ఎలాంటి వరద రావడం లేదు. తుంగభద్ర జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలకుగాను ప్రస్తుతం 80.56 టీఎంసీల నిల్వలుండగా, కాల్వలకు 10,476 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జలాశయాలపై కరువు ఛాయలు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీరు, విద్యుత్ అవసరాలు తీర్చే ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు కరువు ఛాయలు కమ్మేశాయి. ⇒ శ్రీశైలం జలాశయానికి గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 2.97లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం నామమాత్రంగా 491 క్యూసెక్కుల వరద మాత్రమే వచి్చంది. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా 12,274 క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి విడుదల చేయగా, కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు మరో 1,600 క్యూసెక్కులను తరలించుకుంటోంది. ⇒ ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా 4,000 క్యూసెక్కులు, వెలిగొండకు 1,800, హెచ్ఎన్ఎస్ఎస్(మల్యాల)కు 3,450 క్యూసెక్కుల నీటిని తరలించుకుంటోంది. ⇒ శ్రీశైలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 25,872 క్యూసెక్కుల నీటిని వాడుకున్నాయి. దీంతో జలాశయంలో నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 101.92 టీఎంసీలకు నిల్వలు తగ్గిపోయాయి. ⇒ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 13,379 క్యూసెక్కుల వరద వస్తోంది. గతేడాది ఇదే సమయానికి సాగర్‌కు 2.62 లక్షల క్యూసెక్కుల వరద ఉండడం గమనార్హం. జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 178.23 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. సాగర్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 3,408 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయగా, కాల్వలకు 7,456 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వచ్చే నెలలో సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రారంభం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఉండనున్న తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలను తీర్చడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.