హుస్సేన్ సాగర్‌కు మరింత పెరిగిన ఇన్ ఫ్లో
హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండను తలిపిస్తోంది. ఆయా కాలనీలు, నాలాల నుంచి వస్తున్న వరద నీటితో హుస్సేన్ సాగర్ దాదాపు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే మరో రెండు రోజులపాటు వర్షం కురుస్తూ ఉంటే ఆనకట్టపైకి నీరు చేరే ప్రమాదం కూడా లేకపోలేదు. దీంతో దిగువ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క, అధికారుల కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
సాగర్ నడి మధ్యలో ఉన్న బుద్ధ భగవానుడి వేధికపైకి కూడా నీరు చేరేంత మొత్తంలో వరద ఉప్పొంగుతూ వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత మూడు రోజులుగా నగరాన్ని వాన ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వర్షం కారణంగా పొటెత్తుతున్న వరదలతో శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ జలాశయం నీటి మట్టం 513.82 అడుగులకు చేరుకుంది.
దీని పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. దీంతో అధికారులు గతంలో కంటే మరో 500 క్యూసెక్కులు అదనంగా 4,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉండటంతో కొంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. అంతకుముందు రోజు ఇన్ ఫ్లో 4000 క్యూసెక్కులు ఉంది.